అమలు కాని నేతల హామీలు

Dec 12,2023 00:22

– అవస్థల పాలవుతున్న రైతులు
– పంటల ఎన్యుమరేషన్‌కు కానరాని అదికారులు
– పత్తాలేని పరిహార లెక్కలు
ప్రజాశక్తి – పంగులూరు
తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగానికి అండగా ఉంటాం. అధైర్య పడవద్దు. ఆదుకుంటామన్న సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. తుఫాన్ వచ్చి పోయి ఆరు రోజులు గడుస్తుంది. ఎన్యుమరేషన్ చేసే అధికారులు ఇంతవరకు గ్రామాల్లో రైతుల వద్దకు రాలేదు. అసలు ఎన్యుమరేషన్ చేస్తారో, లేదో తెలియక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళముందే పైర్లు ఎండిపోతున్నాయి. రూ.లక్షలాది పెట్టుబడులు సర్వనాశనం అయ్యాయి. ఏమి చేయలేని పరిస్థితుల్లో రైతులు చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిచౌంగ్ తుఫాను కారణంగా మండలంలోని పంటలు దెబ్బతిన్నాయి. మండలంలో పొగాకు 1150హెక్టార్లు, మిర్చి 830హెక్టార్లు, శనగ 2650 హెక్టార్లు, మొక్కజొన్న 546హెక్టార్లు, మినుము 497హెక్టార్లు, వరి 90హెక్టార్లలో సాగు చేశారు. తుఫానుకు ముందు వరకు బాగానే ఉన్న పంటలు, తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. పొగాకు నేల వాలింది. ఆకులు మొత్తం పండిపోతున్నాయి. నేలలో ఉన్న శనగ మొక్క లు, అప్పుడే నేలపైకి వచ్చిన మొక్క కుళ్ళిపోతున్నాయి. మిర్చి పూతరాలిపోయింది. మొక్కపై ఉన్న కాయలు రాలిపోయాయి. చెట్లు విరిగి నేల వాలాయి. మొక్కజొన్న పైరు పూర్తిగా నేలవాలి పోయింది. మినుము కాయ రాలిపోవటం, కాయల్లోకి నీళ్లు వెళ్లి విత్తనం చెడిపోయింది. భారీ స్థాయిలో పంటలు నష్టం జరిగింది. తుఫాను తర్వాత పొలాలకు వెళ్లి ఫైర్లు చూసుకున్న రైతులకు కంటనీరే మిగులుతుంది. ఈ ఏడాది వాతావరణం బాగుంటుందని, పంటలు బాగా పండుతాయని ఆశించిన కౌలు రైతులు కౌలు రేట్లు భారీగా ఉన్నా, అప్పులు చేసి కౌలు పొలాలు సాగు చేశారు. ఎకరా రూ.15వేల నుండి రూ.30వేల వరకు కౌలు ధరలు ఉన్నాయి. వ్యవసాయంలో 60శాతం కౌలు రైతులే ఉన్నారు. కౌలు రైతులకు పంటలు పెట్టుబడితో పాటు కౌలు కూడా నష్టపోతున్నారు. తుఫాను తర్వాత పంటలను పరిశీలించడానికి జిల్లాకు వచ్చిన సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులను ఆదుకుంటానని, రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదని, నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అందిస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఆరు రోజులు దాటినా ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. నష్టాలు అంచనా వేయటానికి ఒక్క అధికారి కూడా తమ పొలాలకు రాలేదని చెబుతున్నారు. మరి కొద్ది రోజులు గడిస్తే నష్టాలు అంచనా వేయడం కూడా కష్టమేనని రైతులు చెబుతున్నారు. వెంటనే అధికారులు తమ పంటలను పరిశీలించి నష్టం అంచనాలు వేయాలని కోరుతున్నారు. వెంటనే నష్టపరిహారాలు అందజేయాలని వాపోతున్నారు.


పరిశీలన టీములు వేస్తాం
– ఎఒ సుబ్బారెడ్డి
మండలంలో తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించి ఎన్యుమరేషన్ రాసేందుకు టీములు ఏర్పాటు చేస్తామని ఎఒ సుబ్బారెడ్డి తెలిపారు. మిర్చి, పొగాకు, మొక్కజొన్న, మినుము, శనగ పంటలు నష్టపోయారని తెలిపారు. వీటిని ఉన్నతాధికారులు ఇచ్చిన సూచనలు మేరకు పరిశీలించి, నష్టాలు అంచనాలు తయారు చేస్తామని తెలిపారు.


అప్పులు తెచ్చి సాగు చేసాం
– తమ్ములూరి పెద్ద కోటయ్య, కౌలు రైతు, చందలూరు.
ఈ ఏడాది వాతావరణం బాగుంటుందని ఆశపడి 5ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తే తుపానుకు దెబ్బతిన్నాయని చందలూరు గ్రామానికి చెందిన కౌలు రైతు తమ్ములూరి పెదకోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలు పొగాకు, ఒక ఎకరం శెనగ, ఒక ఎకరం మిర్చి సాగు చేశానని చెప్పారు. ఎకరం కౌలు రూ.20వేలకు తీసుకొని సాగు చేశానని చెప్పారు. మిరప తోటకు రూ.లక్ష, ఐదు ఎకరాల కౌలు రూ.లక్ష, శనగ పొగాకు రూ.80వేలు మొత్తం రూ.2లక్షల 80వేల నష్టపోయినట్లు చెప్పారు. అధికారులు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.


తుపానుకు పోగా మిగిలిన దాంట్లో కలుపులు పెరిగింది
– కొండ్రగుంట రవి, రైతు, నూజిల్లపల్లి.
తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నగా భారీ వర్షాలకు పొలాల్లో కలుపులు పెరిగిపోయాయని నూజిలపల్లి గ్రామానికి చెందిన రైతు కొండ్రగుంట రవి తెలిపారు. తాను మూడు ఎకరాలు మిర్చి, ఏడు ఎకరాలు శనగ సాగు చేశానని, తుపానుకు రెండు దెబ్బతిని పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.3లక్షల వరకు నష్టం వాటిలిందని అన్నారు. వర్షాల కారణంగా కలుపు పెరిగిపోయిందని తెలిపారు. కలుపు తీయటానికి ఎకరాకు రూ.20వేల వరకు అయ్యే పరిస్థితి ఉందని తెలిపారు. అధికారులు పంట నష్టం నమోదు చేయాలని కోరారు.

➡️