చేనేత సమస్యలపై ఐక్య పోరాటం : చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహనరావు

Jan 3,2024 23:58

ప్రజాశక్తి – చీరాల
రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు ఎదుర్కొన్న సమస్యలపై ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని రాష్ట్ర చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు మాచర్ల మోహనరావు అన్నారు. సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత వృత్తి రక్షణ, జీవనోపాధి హక్కు కోసం గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో చేనేత సదస్సు నిర్వహించారు. చేనేతలకు ప్రభుత్వం నుండి రావలసిన అన్ని రకాల రాయితీలు సాధించుకోవాలని అన్నారు. సద్దస్సులో 11రకాల చేనేత రిజర్వేషన్ చట్టం కచ్చితంగా అమలు చేయాలని కోరారు. చేనేత ఉత్పత్తులకు ముడి సరుకులైన కాటన్, శిల్క్, జరీ, యారన్లపై 20శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చేనేతలకు నేరుగా లబ్ధి చేకూర్చే త్రిఫ్ట్ కం సేవింగ్స్ పథకంలో 10శాతం కేంద్ర ప్రభుత్వ వాటాగా, 10శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా, 10శాతం లబ్ధిదారుల వాటాగా అమలు చేయాలన్నారు. చేనేత వస్త్ర ఉత్పత్తులపై 25శాతం సబ్సిడీ అమలు చేయాలని కోరారు. చేనేత వస్త్ర ఉత్పత్తులు, ముడి సరుకులపై జీఎస్టీ ఎత్తి వేయాలని కోరారు. మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొని చేనేత కార్మికులకు రోజువారి పనిని కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూలధనంగా రూ.1000కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికులకు వృత్తి వల్ల వచ్చే వ్యాధులకు వైద్యం చేయించుకునేందుకు అప్పుల ఊబిలో పడకుండా కుటుంబానికి రూ.50వేల ఆరోగ్య భీమా కల్పించాలని కోరారు. మగ్గాల సంఖ్యను బట్టి సహకార సంఘాలకు నాబార్డ్, ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం 4శాతం వడ్డీతో రుణాలు మంజూరు చేయాలని కోరారు. చేనేత కార్మికులందరికీ వృద్ధాప్య పెన్షన్లు అమలు చేయాలని కోరారు. చేనేత ఉపవృత్తుల వారికి కూడా నేతన్న నేస్తం పథకం, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. చేనేత కుటుంబాలకు నెలకు 150యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చట్టసభల్లో చేనేతలకు ప్రాధాన్యతను కల్పించాలని అన్నారు. సదస్సుకు సమాఖ్య అధ్యక్షులు దేవన వీర నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సదస్సులో ఎంఎల్‌సి పోతుల సునీత, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, టిడిపి నాయకులు గొడుగుల గంగరాజు, బిసి కమిషన్‌ సభ్యులు అవ్వారు ముసలయ్య, మాజీ ఎంపిపి దామర్ల శ్రీకృష్ణ, సజ్జ శ్రీనివాసరావు, వావిలాల దాశరధి, మునగాల వెంకటేశ్వర్లు, దేవన హేమ సుందరరావు, గుంటూరు మల్లికార్జునరావు, గుత్తి సదాశివరావు పాల్గొన్నారు.

➡️