వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

Dec 21,2023 02:25

ప్రజాశక్తి – పంగులూరు
స్వాతంత్రం వచ్చి 70ఏళ్ళు దాటినా వడ్డెరల జీవితాల్లో వెలుగులు లేవని, నిరక్షరాస్యులు గానే బతుకుతున్నారని వడ్డెర సేవా సంఘం జిల్లా అధ్యక్షులు తన్నీరు గజేంద్ర అన్నారు. వడ్డెరలను ఎస్టి జాబితాలో చేర్చాలనే ప్రధాన లక్ష్యంగా గత నెల 22న అలిపిరి నుండి బయలుదేరిన మహా పాదయాత్ర మంగళవారం మండలంలోని ముప్పవరం చేరింది. ఇప్పటికి 700కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బృందానికి వడ్డెర సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. చరిత్రకు రూపం ఇచ్చిన వడ్డెర్లకు నేటికీ చరిత్రలో స్థానం లేదని అన్నారు. సుందర భవనాలు నిర్మించిన వడ్డెరలు నేటికీ పూరిగుడిసెల్లోనే జీవనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బావులు, చెరువులు, కాలవలు, ప్రాజెక్టులు, నిర్మించి దేశాన్ని సస్యశ్యామలం చేసినా నేటికీ ఆకలి చావులు తప్పడం లేదన్నారు. 10శాతం కన్నా తక్కువగా అక్షరాస్యత ఉండటం వల్ల ఒక్క శాతం కన్నా తక్కువగానే ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. రాజకీయ ప్రాధాన్యత శూన్యం అన్నారు. ఆధునిక యంత్రాల రాకతో వడ్డెరల జీవన స్థితిగతులపై ప్రభావం పడిందని అన్నారు. ఆకలి చావులు అధికం అయ్యాయని, సామాజిక జీవనం పతనం అవుతుందని చెప్పారు. బ్రిటిషు వారితో పోరాడినందున 1871నుంచి 1952ఆగస్టు 31వరకు క్రిమినల్ యాక్టులో వడ్డెరలను నేరజాతికూలంగా ముద్రవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డెర కులంలో చైతన్యం లేనందువలన ఎస్టీ రిజర్వేషన్ సాధించలేక పోయామని అన్నారు. నేటికి దేశవ్యాప్తంగా 13రాష్ట్రాల్లో వడ్డెరలు ఎస్సీలుగాను, నాలుగు రాష్ట్రాల్లో ఎస్టీలు గాను, ఒక రాష్ట్రంలో విజేఎన్టి అనే రిజర్వేషన్లు కొనసాగుతున్నమని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బీసీ జాబితాలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో సత్యపాల్ కమిటీని నియమించారని గుర్తు చేశారు. జిల్లాల్లో పర్యటన జరిపి కులస్తుల జీవన విధానంపై అధ్యయనం చేశారని అన్నారు. ప్రభుత్వం మారడంతో సత్యపాల్ కమిటీకి నిధులు మంజూరు చేయకపోవడం వలన నివేదికలు పూర్తి చేయలేదని అన్నారు. ఇప్పటికైనా సత్యపాల్ కమిటీని పునరుద్దరించి కేంద్రానికి పంపిస్తే రిజర్వేషన్ అనేది సాధ్యమేనని అన్నారు. అలిపిరి నుండి బయలుదేరిన పాదయాత్ర విజయవాడ వరకు చేరుతుందని అన్నారు. పాదయాత్రకు కొండమూరు గ్రామ వడ్డెర సేవా సంఘం అధ్యక్షుడు గుంజి వెంకట్రావు, వల్లేపు బాల అంకమరావు, వల్లేపు యశోద స్వాగతం పలికారు.

➡️