వాడీవేడిగా మండల సమావేశం : కుందుర్రు పంచాయితీ కార్యదర్శిపై పిర్యాదు

Mar 15,2024 00:12

ప్రజాశక్తి – సంతమాగులూరు
మండలంలోని కుందుర్రు పంచాయతీ నిధుల విషయంలో పంచాయతీ తీర్మానం లేకుండానే కార్యదర్శి ఆనంద్ నిధులు దుర్వినియోగం చేశాడని సర్పంచి బొమ్మినేని నారాయణ ఎంపీడీఒ జి కాశయ్యకు ఫిర్యాదు చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశం హాలులో ఎంపీపీ ఎనుబర్ల ఎలమంద అధ్యక్షతన మండల పరిషత్ సాధారణ సమావేశం గురువారం నిర్వహించారు. 2023లో కుందుర్రు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేపట్టిన పనులకు చెల్లింపు వివరాల పనులకు తీర్మానాలు ఇవ్వాలని, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని సర్పంచి నారాయణ డిమాండ్ చేశారు. వ్యవసాయ అదికారిణి లావణ్య మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ నెల్లో వచ్చిన మిచౌంగ్ తుఫాన్ తాకిడికి పంటలు దెబ్బతిని 409మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.36లక్షలు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ అవుతాయని తెలిపారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు అభివృద్ధి చెందాయని, రానున్న విద్యా సంవత్సరంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించే విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎంఈఓ వి కోటేశ్వరరావు కోరారు. మహిళా సంఘాల ద్వారా పురుగు మందులు లేని వ్యవసాయం చేపట్టనున్నట్లు ఎపీఎం దుడ్డు మస్తానరావు తెలిపారు. అంగన్‌వాడి కేంద్రాల్లో మరుగు దొడ్లు నిర్మించాలని అంగన్‌వాడి సూపర్ వైజర్లను ప్రజా ప్రతినిధులు కోరారు. సంతమాగులూరు నుండి బాపట్ల వరకు ఆర్టీసీ బస్సు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఒకి తెలిపారు. సమావేశంలో పశువైద్యం, రెవిన్యూ, విద్యుత్, హౌసింగ్, ఎన్ఎస్పి, ఆర్అండ్బి అధికారులు గైర్ హాజరయ్యారు. సమావేశానికి రాని శాఖల నుండి వచ్చే సమావేశానికైనా హాజరయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️