జగనన్న పాలనలో సంక్షేమం

Feb 10,2024 00:02

ప్రజాశక్తి- సంతమాగులూరు
జగనన్న అక్క, చెల్లెమ్మలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు, ఓసీలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వైసీపీ ఇన్‌చార్జి పానెం చిన్న హనిమిరెడ్డి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వైసీపీ మండల కన్వీనర్ చింతా రామారావు అధ్యక్షతన జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ సభలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ చెక్కును మహిళా సమైఖ్యకు అందజేశారు. సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సభలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో ప్రజల ప్రయోజనార్థం అనేక సార్లు సిఎం జగన్‌ బటన్ నొక్కారని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న కోసం రెండుసార్లు బటన్ నొక్కాలని మహిళలను కోరారు. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రుణమాఫీ చేశారని అన్నారు. సచివాలయ వాలంటరీ వ్యవస్థ ఏర్పాటుతో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. జగనన్న పరిపాలనలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వివక్షతకు తావు లేకుండా పథకాలు అమలు చేశారని అన్నారు. మాయల మరాఠీలను, రోజుకొక రంగు మార్చే ఊసరవెల్లి నాయకులను, ఐదేళ్లకోసారి కనబడే ప్రస్తుత ఎంఎల్‌ఎ వంటి నాయకున్ని చూసి ప్రజలు మోసపోవద్దని అన్నారు. తాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. గత ప్రభుత్వం డ్వాక్రా, రైతు రుణమాఫీ చేస్తానని చేయకుండా ప్రజలను మభ్య పెట్టారని అన్నారు. సిఎం జగన్‌ చెప్పిన మాట ప్రకారం డ్వాక్రా రుణం మాఫీ చేసి చూపించారన్నారు. మండలానికి 4వ విడతగా రూ.11.36కోట్లు, 1147 గ్రూపులకు వచ్చాయని అన్నారు. ఇప్పటివరకు రూ.45.47కోట్లను 11260 మంది మహిళలకు లబ్ధి చేకూరిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్క మహిళ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సిఎంగా మళ్లీ జగన్మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, ఎంపీడీఒ జి కాశయ్య, ఎపిఎం డి మస్తానరావు, ఎసి కె రవికుమార్, మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మీ శేషు, సీసీలు వెంకయ్య, ఎఎంసి వైస్ చైర్మన్ విప్పల ముసలారెడ్డి, ఓరుగంటి కోటిరెడ్డి, బొల్లినేని రామకృష్ణ, కారసాని కోటిరెడ్డి, శేషిరెడ్డి పాల్గొన్నారు.

➡️