అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాస్తారోకో

Feb 8,2024 22:56

ప్రజాశక్తి – రేపల్లె
సమస్యలను పరిష్కరించాలని అడిగిన ఆశావర్కర్ల అక్రమ అరెస్టులను నిరసిస్తూ స్థానిక బస్టాండ్ సెంటర్లో గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఆశా వర్కర్ల మహిళలపై నిర్బంధాన్ని ప్రయోగించే ప్రభుత్వానికి ఇంటిదోవ తప్పదని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ హెచ్చరించారు. సిఐటియు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో నిన్నటి నుంచి జరుగుతున్న అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని నిరససిస్తు, తమ న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని రాస్తారోకో చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలను రెండు రోజులు ముందుగానే వాళ్ల పనిప్రదేశాల దగ్గర నుండి, ఇళ్లవద్ద నుండి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి నిర్బంధించడాన్ని ఖండించారు. కనీస వేతనం, గ్రూప్ ఇన్సూరెన్స్, సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సంక్షేమ పథకాల అమలు, మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 62ఏళ్ల రిటైర్మెంట్ జిఓని వర్తింపచెయాలని కోరారు. రిటైర్మెంటైన వారు, మరణించిన కుటుంబాల్లో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు చెయాలని అన్నారు. కోవిడ్ కాలంలో 2020మార్చి నుండి మరణించిన వారికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని అన్నారు. ఖాళీ పోస్టులు భర్తీచేయాలని, నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని కోరారు. రాజకీయ జోక్యం తొలగించాలని అన్నారు. ఆశాలకు ఎఎన్ఎం ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు. ఎఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ పొందిన ఆశా వర్కర్లకు ఎఎన్ఎం,హెల్త్ సెక్రటరీల, స్టాఫ్ నర్స్ నియామకాల్లో వెయిటేజిని ఇవ్వాలనే డిమాండ్స్‌తో ఆశావర్కర్స్ ఈరోజు ఛలో విజయవాడ పిలుపు ఇస్తే సమస్యలు పరిష్కారం చేయటం చేతకాని ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆశావర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ వీరలక్ష్మి, ఎస్ దానమ్మ, దేవి, కరీమున్నీసా, గ్లోరీ, సిఐటియు నాయకులు కె ఆశీర్వాదం, డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️