పల్నాడులో రణం

May 14,2024 01:48

నరసరావుపేట మల్లమ్మ సెంటర్‌లోదహనమవుతున్న టిడిపికి చెందిన వారి కారు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగింది. పోలింగ్‌ ఉదయం మందకొడిగా ప్రారంభం అయినా మధ్యాహ్నం తరువాత వేగం పుంజుకుంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావడం కన్పించింది. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నమోదు అయిన పోలింగ్‌ 75 శాతంగా నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. రాత్రి 12 గంటల వరకూ పలు కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతున్నందు వల్ల ఇంకా పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని ఈవివరాలు మంగళవారం వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు భారీగా క్యూలైన్లలో ఉండటంతో వారికి స్లిప్పులు ఇచ్చి పోలింగ్‌ను కొనసాగించారు. కొన్ని చోట్ల ఈవిఎంలు మొరాయించినా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీససౌకర్యాలు కల్పించలేదని ఎండ తీవ్రత వల్ల మహిళలు,వృద్దులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. పోలింగ్‌ సందర్భంగా టిడిపి, వైసిపి పోటాపోటీగా వ్యవహరించడంతో గుంటూరు, పల్నాడుజిల్లాల్లో ఘర్షణలు తలెత్తాయి. పల్నాడులో తీవ్ర ఘర్షణలు తలెత్తగా ఇతర ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు తలెత్తాయి. రెంటచింతల, కారండిపూడి, నకరికల్లు మండలాలలో ఈవిఎంలను ధ్వంసం చేశారు. తుమృకోట, జెట్టి పాలెం, పాల్వాయి గేటు గ్రామాలలో ఈవిఎంలు ధ్వంసం చేయగా ప్రత్యామ్నాయ ఈవీయంలో ఏర్పాటు చేసి పోలింగ్‌ కొనసాగించారు. నకరికల్లు మండలంలో గుండ్లపల్లి, కారంపూడి మండలం ఒప్పిచర్లలో ఘర్షణ చోటు చేసుకోవడంతో ఈవిఎం ను పగలగొట్టారు. వైసిపి-టిడిపి మధ్య తీవ్ర రూపంలో ఘర్షణలు జరిగి పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల వారు గాయపడ్డారు.

మాచర్లలో ఓటర్ల క్యూ
రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మరెడ్డి వాహనాన్ని వైసిపి నాయకులు తగులబెట్టారు. నర్సరావుపేటలో టిడిపి, వైసిపి అభ్యర్ధులు అరవిందబాబు, శ్రీనివాసరెడ్డిపై దాడులు జరిగాయి. టిడిపి అభ్యర్థిపై వైసిపి, వైసిపి అభ్యర్థిపై టిడిపి కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో ఓటు విషయంలో వైసిపి టిడిపి మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నాటు బాంబులు పెట్రోల్‌, సీసాలతో దాడి చేసుకోగా అదే సమయంలో అక్కడే ఉన్న రెవెన్యూ అధికారి బైక్‌ గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. నరసరావుపేటలో టిడిపి, వైసిపి వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. మల్లమ్మ సెంటర్‌లో టిడిపి నాయకులకు చెందిన వాహనాన్ని తగులబెట్టారు. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో టిడిపి, వైసిపి మధ్య ఘర్షణ జరిగింది. చిలకలూరిపేట మండలం కావూరు జరిగిన ఘర్షణలో ఇద్దరు టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల వద్ద 251 పోలింగ్‌ కేంద్రంలో ఈవిఎంను ధ్వంసం చేశారు. నర్సరావుపేటమండలం దొండపాడువద్ద ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులుపై దాడి జరిగింది. వైసిపికి చెందిన నాయకులు శ్రీకృష్ణదేవరాయుల మూడు కార్లను ధ్వంసం చేశారు. తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో వైసిపి, టిడిపి మధ్య ఘర్షణజరిగింది. ముప్పాళ్ల మండలం నార్నేపాడులో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై టిడిపి వారు దాడి చేశారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో గుంటూరు లోక్‌సభ వైసిపి అభ్యర్థి కిలారి రోశయ్య వాహనాన్ని టిడిపి వర్గీయులు అడ్డుకున్నారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో టిడిపి, వైసిపి మధ్య ఘర్షణలు జరిగాయి. కొల్లిపర మండలం జముడు పాడు గ్రామంలో వైసిపి, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. నూజెండ్ల మండలం జంగాలపల్లిలో ఎస్‌సి సామాజిక వర్గానికి చెందిన వారిని ఓటుకు రానివ్వకుండా టిడిపి వారు అడ్డుకున్నారని వైసిపి వారు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో టిడిపి, వైసిపికి మధ్య వాగ్వావాదం జరిగి కొద్ది సేపుపోలింగ్‌ నిలిచిపోయింది. అచ్చంపేట, కొత్తపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. గుంటూరు కొత్తపేట పోలిసు స్టేషన్‌లో పొత్తూరి వారి తోట 2వ లైను ఘర్షణ పడుతున్న ఇరు వర్గాల వారిని పోలీసులు చెదరగొట్టారు. తాడేపల్లి మండలం ఉండవల్లి, నులకపేటలో పోలింగ్‌ ముగిసిన తరువాత టిడిపి, వైసిపి మధ్య ఘర్షణలు జరిగాయి.
గుంటూరు టిజెపిఎస్‌ కాలేజీ వద్ద ఓటర్ల క్యూ

➡️