23,24 తేదీల్లో జీవ వైవిధ్య దినోత్సవం

జీవ వైవిధ్య దినోత్సవం

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఈ నెల 22, 23 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఎయు విసి ఆచార్య పివిజిడి ప్రసాద రెడ్డితో కలిసి నేషనల్‌ బయోడైవర్సిటీ అథారిటీ కార్యదర్శి డాక్టర్‌ బి.బాలాజీ ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 22న బీచ్‌రోడ్డులోని ఎయు కన్వెన్షన్‌ సెంటర్‌లో సదస్సు, ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తారు. 23న ఎయు వృక్షశాస్త్ర విభాగంతో కలిసి ఒకరోజు జాతీయ సదస్సును నిర్వహిస్తారు. దెబ్బతింటోన్న జీవవైవిధ్య పరిరక్షణలో ప్రతి వ్యక్తినీ భాగస్వాములను చేసే దిశగా పనిచేస్తామన్నారు.ఎపి బయోడైవర్సిటీ బోర్డ్‌ మెంబర్‌ సెక్రటరీ బివిఎ.కృష్ణమూర్తి మాట్లాడుతూ జీవవైవిధ్య పరిరక్షణ దిశగా ఎయచు చేసే కార్యక్రమాలకు తాము సహకారం అందిస్తామన్నారు. సంరక్షణ, పరిశోధన, అధ్యయన రంగాలకు ఉపయుక్తంగా జీవవైవిధ్య పరిరక్షణ చేయాలని సూచించారు. ఎయు విసి ఆచార్య ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఎయులో బయో డైవర్సిటీ పార్క్‌ ఏర్పాటుకు ప్రత్యేకమైన స్థలాన్ని గుర్తించామన్నారు. ఎయు వేదికగా వెయ్యి స్టార్టప్‌ సంస్థలు పనిచేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎయు టెక్‌ హబ్‌లో ఇప్పటికే 172 సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. విదేశీ విద్యార్థుల సంఖ్య వెయ్యి మార్క్‌ను దాటిందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌స్టీఫెన్‌, బోటనీ ప్రొఫెసర్‌ ఎస్‌బి పడాల్‌, సంధ్య దీపిక, రత్నకుమార్‌, బలరాం పడాల్‌, డాక్టర్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వర్సిటీ తరపున డాక్టర్‌ బాలాజీని సత్కరించారు.

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎయు విసి, బయోడైవర్సిటీ నేషనల్‌ సెక్రటరీ బాలజీ

➡️