ఎన్నికల అక్రమాలపై సీ విజిల్‌ వేయండి

May 3,2024 22:20

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికలను సజావుగా నిర్వహిం చేందుకు భారత ఎన్నికల సంఘం తెచ్చిన ‘సీ’ విజిల్‌ యాప్‌ను బాధ్యత కలిగిన పౌరులందరూ ఉపయోగించవచ్చు. ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ యాప్‌ ద్వారా అధికార పార్టీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి వీలుంది.యాప్‌ ను ఇలా ఉపయోగించాలి..పౌరులు ఎక్కడైనా తమ కళ్ల ముందు ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని భావిస్తే ఆ దృశ్యాన్ని మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఫొటో లేదా 2 నిమిషాలు ఉండేలా వీడియోను చిత్రీకరించాలి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం బెదిరించడం, డబ్బు, మద్యం, వస్తువుల పంపిణీ, అనుమతి లేకుండా పోస్టర్లు వేయడం, రాజకీయ నాయకలు వ్యక్తి గత దూషణలు, రాత్రి 10గంటలు దాటినా ప్రచారం చేయడం వంటి ఘటనలు వీడియో లేదా ఫొటోలను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. యాప్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఎన్నికల అక్రమాల గురించి రెండు వాఖ్యలు కూడా రాసే అవకాశం ఉంటుంది. అప్లోడ్‌ చేసే సమయంలో జీపీఎస్‌ ఆన్‌ చేసి ఉంచాలి. ఇది వెంటనే జిల్లా కేంద్రంలోని ఎన్నికల కంటోల్‌ రూమ్‌కు చేరుతుంది. సంఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రాంతంలోని ప్లైయింగ్‌ స్క్వాడ్‌కు సమాచారం వెళ్తుంది. వెంటనే వారు అక్కడికి చేరుకొని ఘటనపై కేసు నమోదు చేస్తారు. ఈ మొత్తం వివరాలను ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్‌ గ్రీవెన్స్‌ పోర్టల్‌కు నివేదిస్తారు. వంద నిమిషాల్లో అధికారులు తీసుకున్న చర్యలను వివరిస్తూ అప్లోడ్‌ చేసిన వ్యక్తి ఫోన్‌కు సందేశం పంపిస్తారు. పౌరుడి వివరాలను సైతం ఎన్నికల కమిషన్‌ అత్యంత గోప్యంగా ఉంచుతుంది.

➡️