వైసిపి, టిడిపి అభ్యర్థులిద్దరూ ప్రజలను పీడించే వాళ్లే

ప్రజాశక్తి-కమలాపురం ఇండియా వేదిక బలపరుస్తున్న కమలాపురం అసెంబ్లీ సిపిఐ అభ్యర్థి గాలి చంద్రను గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు ప్రజలను కోరారు. సోమవారం కమలాపురం అడ్డరోడ్డు నుండి సిపిఐ శ్రేణులు నాయకులు ఎర్రజెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో గాలి చంద్ర నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి రెండు ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తున్నాయన్నారు. బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ తన అంతర్గత ఎజెండాను దేశ ప్రజలపై రుద్దుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తుందన్నారు. దేశంలో పేదరికం నిరుద్యోగం ధరల పెరుగుదల రోజురోజుకు పెరుగుతుందన్నారు. కొత్త, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తులు ప్రైవేటుపరం చేస్తుందన్నారు పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందన్నారు. దొంగ నోట్లను నల్లధనాన్ని, అవినీతిని అరికట్ట లేకపోయిందన్నారు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తుందన్నారు. సిబిఐ, ఇడి, ఐటి వ్యవస్థలను తన చెప్పు చేతల్లో పెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం వాళ్ళను జైల్లో నిర్బంధించడం చేస్తుందన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభివద్ధిని అటకెక్కించిందన్నారు. అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడతామని, కడప కొప్పర్తి పారిశ్రామిక వాడలో భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఊదరగొట్టిన జగన్మోహన్‌రెడ్డి ఈ నాలుగున్నర సంవత్సరంలో చేసింది ఏమీ లేదన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యలు పక్కనపెట్టి భూ కబ్జాలు దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడుతూ అధికారాన్ని ఉపయోగపెట్టుకొని విచ్చలవిడిగా కోట్లు రూపాయలు దోచుకున్నారే తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, జిల్లా నాయకులు రామమోహన్‌, దస్తగిరిరెడ్డి, సిపిఐ నాయకులు చంద్రశేఖర్‌, జి.నాగేశ్వరావు, జి.వేణు గోపాల్‌, ఎన్‌.వెంకట శివ, సుబ్బారెడ్డి, నాగసుబ్బారెడ్డి, బషీర్‌ నిషా, సుబ్రహ్మణ్యం, శ్రీరాములు, బాదుల్లా, గంగా సురేష్‌ పాల్గొన్నారు.

➡️