గెలుపుపై ధీమాగా అభ్యర్థులు

May 10,2024 00:34

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పోలింగ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో గురజాల నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. పల్నాడు జిల్లాలో గురజాల నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం. 2,72,152 లక్షలు ఓట్లు ఉండగా వీరిలో పురుషలు ఓట్లు 1,32,492, మహిళల ఓట్లు 1,39,618, ఇతరులు ఓట్లు 42 ఉన్నాయి. టిడిపి నుండి వరసగా 7వ సారి నామినేషన్‌ ధాఖాలు చేసిన ఎన్‌డిఎ కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గంలో ఇప్పటికి మూడుసార్లు ఎమ్యెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి జనసేన కూడా తోడవడం, వైసిపి నుండి విభేదించిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా యరపతినేని విజయానికి కృషి చేస్తుండడంతో యరపతినేని గెలపుపై కొంత ధీమాగా ఉన్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గతంలో గురజాల నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసిపి అధిష్టానం ఆదేశాలు మేరుకు గురజాల సీటును కాసుకు అప్పజెప్పి కాసు మహేష్‌ రెడ్డి గెలుపుకు కృషి చేశారు. గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణం మండలాలు ఎక్కువ మెజార్టీ వస్తుందని టిడిపి నాయకులు భావిస్తున్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనతోపాటు స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అవినీతీ తమకు విజయాన్ని తెచ్చిపెడుతుందని యరపతినేని శ్రీనివాసరావు అంటున్నారు. గురజాలకు ప్రత్యేక మేనిఫెస్లోనూ ప్రకటించారు. మరోవైపు అభివృద్ధి, సంక్షేమం చేశాము కాబట్టి తామే మళ్లీ గెలవబోతున్నామని వైసిపి అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి మరింత ధీమాగా ఉన్నారు. పిడుగురాళ్లకు 100 ఎంబిబిఎస్‌ సీట్లతో మెడికల్‌ కళాశాల తెచ్చామని, ఇది పూర్తయితే 1000 పడకలతో వైద్యశాల కూడా అందుబాటులోకి వస్తుందని, గురజాల, దాచేపల్లిను నగర పంచాయితీలుగా చేశామని, పిడుగురాళ్ల బైపాస్‌ను పూర్తి చేశామని, ప్రధాన రహదారిని విస్తరించామని, పట్టణంలో 8 వేలకుపైగా ఇంటింటికి కృష్ణ నీరు అందిచామని చెబుతున్నారు. నియోజకవర్గంలో రూ.217 కోట్లతో 57 గ్రామాలకు కృష్ణానది నీరు అందించనున్నట్లు చెబుతున్నారు. దీనికితోడు గత ఎన్నికల్లో జనసేన నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసిన చింతలపూడి శ్రీనివాసరావు ప్రస్తుతం వైసిపిలో చేరారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో 28 వేల మెజార్టీతో గెలుపోందిన తాను మళ్లీ గెలిచి తీరుతానని భావిస్తున్నారు.

➡️