ఉపాధిహామీని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర

May 16,2024 20:24

ప్రజాశక్తి-పాచిపెంట : ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కుట్ర మానుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చల్ల గాలినాయుడు, సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలోని పాంచాలిలోని నారాయణ చెరువు వద్ద పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారు మాట్లాడుతూ ఎర్రజెండా నాయకత్వంలో పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగానే రెండు పూటలా పని పెడుతున్నారని, దీనివల్ల కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. చట్టంలో రెండు పూటలా పని పెట్టాలని ఎక్కడా లేదని, రెండు పూటలా పనిచేసిన గిట్టుబాటు కూలి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసిన చోట ఎక్కడా టెంట్లు, మంచినీరు సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ తరహాగా రూ.600 రోజు కూలి చెల్లించాలని, 200 రోజులు పనులు ఇవ్వాలని, పని చేసిన చోట మెడికల్‌ కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని అన్నారు. మేట్లకు రావాల్సిన బకాయి డబ్బులు చెల్లించాలని, ఉపాధి హామీ సక్రమంగా అమలు చేసి కూలీలకు న్యాయం చేయాలని, క్యూబిక్‌ మీటర్‌ రేట్లు పెంచాలని డిమాండ్‌ చేశారు.

➡️