బాలల హక్కులను పరిరక్షించాలి

May 18,2024 23:14 #child rights
Child rights

 ప్రజాశక్తి – అరిలోవ : బాలల హక్కుల పరిరక్షణలో అధికారులు కీలక పాత్ర పోషించాలని ఎపి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు కోరారు. బాలల హక్కులు, వారి సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు, జిల్లా బాలల సంరక్షణ అధికారులతో ఆర్‌జెడి జి.చిన్మయిదేవి నేతృత్వంలో కృష్ణాపురం మహిళా ప్రాంగణంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసలి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో గొండు సీతారాం పాల్గొన్నారు. ముందుగా వీరు 6 జిల్లాల్లో ఇంతవరకు నమోదైన బాల్య వివాహాలు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలు, గ్రామ స్థాయిలో వీటి నిర్మూలనకు ఏర్పాటుచేసిన కమిటీలు, వాటిలో ప్రజా ప్రతినిధుల పాత్ర, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపడుతున్న ప్రణాళికాయుత చర్యలు, కార్మిక శాఖ సమన్వయంతో ఎటువంటి చర్యలు చేపట్టారు, బాల యాచకులు నిర్మూలనకు, వారిని అదుపులోకి తీసుకున్నాక వారి విద్యాభ్యాసం, అభివృద్ధికి చేపట్టే చర్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం అనాధ, పేద పిల్లలకు మిషన్‌ వాత్సల్య పథకం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు, వారికి చేరవేస్త్తున్న విధి విధానాలపై జిల్లాల వారీగా లెక్కలతో పాటు అడిగి తెలుసుకున్నారు. అధికారిక దత్తత కార్యక్రమాలపై జిల్లా బాలల సంరక్షణ అధికారుల సమన్వయంతో ఎటువంటి ప్రచార, అవగాహనా కార్యక్రమాలు చేపట్టారో నివేదికల ద్వారా సమాచారం రాబట్టారు. ఈ ఏడాది ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం కేటాయించిన సీట్లుపై ఆయా పాఠశాలల యాజమాన్యాలు తిరస్కరిస్తే జిల్లా విద్యా శాఖాధికారుల సమన్వయంతో చేపడుతున్న చర్యలు క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు.

➡️