అంగన్వాడీలకు బెదిరింపులు..

Jan 16,2024 22:27
అంగన్వాడీలకు బెదిరింపులు..-

సెలవు రోజు కూడా వదిలిన ఐసిడిఎస్‌ అధికారులు – వివరాలు సేకరిస్తూ హెచ్చరికలుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లాలో ఐసిడిఎస్‌ అధికారులు ప్రాజెక్టులలో నాయకత్వం వహిస్తున్న నాయకుల వివరాలను సేకరిస్తూ బెదిరింపులకు పాల్పడడం సరైనది కాదని వెంటనే మానుకోవాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36వ రోజు అంగన్వాడీల సమ్మె కోటి సంతకాల సేకరణతో కొనసాగుతున్నదన్నారు. గ్రామగ్రామాన లబ్ధిదారులందరినీ కలుస్తూ అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విస్తృతంగా చేస్తున్నారు. ఈ క్రమంలో ఐసిడిఎస్‌ అధికారులు సెలవు రోజు కూడా అంగన్వాడీలను వదలకుండా వివరాలు సేకరిస్తూ బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. మిగతా రోజుల్లో సక్రమంగా డ్యూటీ చేయని అధికారులు ఇప్పుడు మాత్రం సెలవులు రోజులు కూడా అంగన్వాడీలను బెదిరింపులకు వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం, ఐసిడిఎస్‌ సంరక్షణ కోసం జరుగుతున్న సమ్మెకు పరోక్షంగా సహకరించాల్సింది పోయి ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లాలో కుప్పం, కార్వేటినగరం, బైరెడ్డిపల్లి ప్రాజెక్టుల సిడిపివోలు ఇష్టారాజ్యంగా బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. వీరిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పండుగ సమయంలో కూడా ఆడపడుచులను వీధిలో పెట్టి వారు మాత్రం పండుగ చేసుకుంటూ సంతోషాలు గడపడం బాధితరాహిత్యం అన్నారు. నేటి నుంచి రాష్ట్రంలో జరిగే నిరవధిక నిరాహార దీక్షలకు ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి జయప్రదానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

➡️