అదరం.. బెదరం..

Dec 26,2023 21:37

అంగన్వాడీల సమ్మెను భగం చేసేలా ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్నా అదరం.. బెదరం.. అంటూ లక్ష్యసాధనలో అంగన్వాడీలు వీరోచింతంగా పోరాడుతున్నారు. జీతాలపెంపు విషయం తప్ప మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామంటే ఎలా మా ప్రధాన సమస్య జీతాలే.. అంటున్నారు. జీతాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తగ్గేదేలే.. అంటూ అంగన్వాడీలు సాగిస్తున్న పోరాటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాసంగా మారింది. 15 రోజులగా జిల్లా వ్యాప్తంగా 12ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీలు వీరోచితంగా సమ్మెను కొనసాగిస్తున్నారు. సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు నేతలతో పాటు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు అంగన్వాడీల పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ నిర్భాందాన్ని ఎదుర్కొన్ని పోరాడుతున్న అంగన్వాడీల పోరాటం కార్మికవర్గానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఒక్క జీతాల పెంపేకాదు. ప్రమాదంలో ఉన్న ఐసీడిఎస్‌ను కాపాడుకొనేలా సేవ్‌ ఐడిసిడిఎస్‌ అంటూ సాగుతున్న పోరాటానికి లబ్దిదార్లు బాసటగా నిలుస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పులిచెర్ల, జీడి నెల్లూరు మినహా అన్ని ప్రాజెక్టుల్లో సమ్మె కొనసాగుతోంది. జీడి నెల్లూరులో మూడురోజుల పాటు విధులను బహిష్కరించి సెమ్మలో పాల్గొన్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్ళు, అధికార్ల బెదిరింపులతో అంగన్వాడీలు వెన్నకి తగ్గారు. మిగిలిన ప్రాజెక్టుల్లో విజయవంతంగా సమ్మె కొనసాగుతోంది. వినూత్న రీతిలో రోజుకో విధంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమ్మెను కొనసాగిస్తున్నారు. అంగన్వాడీల పోరాటానికి రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నారు. తమ న్యాయమైన కోరికపట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిచేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీ యూనియన్‌ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
ప్రజాశక్తి- కార్వేటినగరం: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడంతో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరింది. మంగళవారం కార్వేటినగరం ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఖాళీ ప్లేట్లు గరిటలతో శబ్దం చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నదని ప్రశ్నించారు. నేటి నుంచి సమ్మె ఉధతరూపం దాల్చుతుందని గతంలోనే హెచ్చరించినా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జగమొండిలాగా వ్యవహరిస్తుంటే అంతకంటే రెట్టింపు స్థాయిలో అంగన్వాడీలు పోరాటం చేయడంతో వారి పోరాటానికి రోజురోజు మద్దతు పెరుగుతున్నదని తెలిపారు. దీంతో గతంలో జరిపిన చర్చలు సందర్భంగా వేతనాలు, గ్రాట్యూటీ పెంచబోమని ఇంకా చర్చలు కూడా జరిపేది లేదని గంభీరంగా కూర్చున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ఉధతం చూసి ఈరోజు మళ్లీ చర్చిలకు ఆహ్వానించడం స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే ఈ దఫా చర్చలోనైనా మొండిగా వ్యవహరించకుండా న్యాయమైన సమస్య, మీరు హామీ ఇచ్చిన సమస్యను వెంటనే పరిష్కారం చేసే దిశగా చర్చలలో ప్రకటించాలని ఆయన అన్నారు. చర్చలపేరుతో దాటవేస్తూ వస్తే సమ్మె ప్రజాఉద్యమంగా రూపుదాల్చుతుందని హెచ్చరించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. చర్చలు సఫలం కాకపోతే రేపు ప్రజాప్రతినిధులకు సామూహిక వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుందని, 28 నుండి 31 వరకు రిలేదీక్షలు కొనసాగుతాయని, జనవరి 3న కలెక్టరేట్‌ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ నాయకులు మమత, యువరాణి, రాధా, అంగన్వాడీలు పాల్గొన్నారు.అంగన్వాడీలకు సంఘమిత్రల మద్దతుఏపీ వెలుగు యానిమేటర్స్‌ ఉద్యోగులు సంఘం ఆధ్వర్యంలో 15వ రోజు అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఎస్‌ఆర్‌ పురం, వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాల సంఘమిత్రలు శిబిరం వద్దకు వచ్చి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా ఆ సంఘం జిల్లా నాయకులు శ్రీధర్‌, శేషాద్రిలు మాట్లాడుతూ అంగన్వాడీ, స్కీంవర్కర్లు సమస్యలన్నీ ఒకటేనని అందరూ ఐక్యంగా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. చిత్తూరుఅర్బన్‌: జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె మంగళవారానికి 15వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. జిల్లాలో వినూత్న రీతిలో అంగన్వాడీలు ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరులో గిన్నెలు, పేట్లుతో శబ్ధాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సృజని, బుజ్జి, ప్రేమ, ప్రభావతిలతో పాటు చిత్తూరు ప్రాజెక్టు పరిధిలోని చిత్తూరు అర్బన్‌, రూరల్‌, గుడిపాల మండలాల అంగన్వాడీలు, సహాయకులు పాల్గొన్నారు. యాదమరి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడంతో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరింది. మంగళవారం యాదమరి మండల కేంద్రం తహశీల్దార్‌ కార్యాలయం ముందు అంగన్వాడీ వర్కర్స్‌ ఖాళీ గిన్నెలతో శబ్దం చేస్తూ నిరసన తెలిపారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు షకీలా మాట్లాడుతూ ఈనెల 28 నుండి 31 వరకు రిలేదీక్షలు కొనసాగుతాయని జనవరి 3న కలెక్టరేట్‌ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. పలమనేరు: స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియుల ఆధ్వర్యంలో అంగన్వాడీల సమ్మె మంగళవారానికి 15వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర, నాయకులు గిరిధర్‌ గుప్తా, ఓబుల్‌రాజు, జ్యోతీశ్వర్‌, ఈశ్వర్‌ అంగన్వాడీల సమ్మెలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు.

➡️