అదరం.. బెదరం… చెదరం

Jan 12,2024 22:42
అదరం.. బెదరం... చెదరం

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె దీక్షలు శుక్రవారానికి 32వ రోజుకి చేరుకుంది. శుక్రవారం అంగన్వాడీ వర్కర్లు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేపట్టారు. దీక్షకు సీఐటీయూ, ఏఐటీయూసీ, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. జిల్లా నాయకులు సుజిని, షకీల, ప్రభావతి, రమాదేవిలు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లు, మినీ అంగన్వాడి వర్కర్లులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని, ఉచిత భీమా సౌకర్యం, మినీ అంగన్వాడి సెంటర్లను మెయిన్‌ సెంటర్‌ గా గుర్తించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అంగన్వాడీ కార్యకర్తలకు వర్తింపజేయాలనే ప్రధాన డిమాండ్‌లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. గత 32 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపకపోవడం దారుణం అన్నారు. తన దుర్మార్గపు ఆలోచనతో అంగన్వాడి వర్కర్ల ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఎస్మా చట్టం, జీవో నెంబర్‌ 2ను విడుదల చేసి అంగన్వాడీ కార్యకర్తలను ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించడాన్ని, అధికార పార్టీలకు సంబంధించిన నాయకులు చేత, పోలీసులు చేత అంగన్వాడి కార్యకర్తలను బెదిరించడాన్ని, భయభ్రాంతులు చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలని లేనిపక్షంలో మరొక ఉద్యమం రుచి చూడవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులకు అంగన్వాడి కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కాంజివరం సురేంద్రన్‌ మాట్లాడుతూ గతంలో జగన్మోహన్‌ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోగా వారిని రోడ్డున పడవేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా చర్చకు ఆహ్వానించి డిమాండ్‌లు పరిష్కారానికి కృషి చేయాలన్నారు.జనవిజ్ఞాన వేదిక నాయకుల సంఘీభావంప్రజాశక్తి-పలమనేరు: మండలంలో ఐసిడిఎస్‌ ఆఫీసు వద్ద అంగన్వాడీలు చేపడుతున్న దీక్షకు జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వైవి నాగేశ్వరరావు, కడప కార్యదర్శి సురేష్‌, ఎల్‌ఐసి డివిజన్‌ కార్యదర్శి కుమార్‌స్వామి సంఘీభావం తెలియజేశారు. వారు మాట్లాడుతూ 32 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యొక్క న్యాయమైన డిమాండ్‌లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయాల్సింది పోయి, ఎస్మా ప్రయోగించడం, భయభ్రాంతులను చేయడం సరికాదన్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని సిఐటియు నాయకులు గిరిధర్‌ గుప్తాయ తదితరులు పాల్గొన్నారు.

➡️