ఆర్థిక బకాయిలు విడుదల చేయాలి : యుటిఎఫ్‌ దశల వారి పోరాటం

Dec 26,2023 21:40

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన వివిధ బకాయిలను వెంటనే విడుదల చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జివి.రమణ డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సోమశేఖర్‌ నాయుడు మాట్లాడుతూ ఉద్యోగుల ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పిఆర్సి, డిఎ, మెడికల్‌ రీయంబర్స్మెంట్‌, ఏపీ జిఎల్‌ఐ పిఎఫ్‌ సరెండర్‌ లీవ్‌ బకాయిలు రాష్ట్ర వ్యాపితంగా సుమారు 18వేల కోట్లు ఉన్నాయని ప్రభుత్వం తక్షణమే నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గతంలో ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో సెప్టెంబర్‌ నెలలో అన్ని బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ డిసెంబర్‌ నెల గడుస్తున్నా ప్రభుత్వం ఒక్క రూపాయిని కూడా విడుదల చేయలేదని అన్నారు. రాష్ట్రవ్యాపిత దశలవారి పోరాటాలకు యుటిఎఫ్‌ పిలుపునిచ్చిందని, ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి జిల్లా కలెక్టర్లకు ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యాలు చేయడం జరిగిందని ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నట్లు తెలియజేశారు. అందులో భాగంగా డిసెంబర్‌ 27 సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాత తాలూకా కేంద్రాలలో ఆరు గంటల నిరసన కార్యక్రమాలు జరపాలని యుటిఎఫ్‌ రాష్ట్రకమిటీ పిలుపునిచ్చిందని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే చెల్లించాలని లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయకుంటే జనవరి 3వ తేదీన అన్ని జిల్లా కేద్రాలలో 12గంటల ధర్నాను, జనవరి 9,10వ తేదీలలో విజయవాడలో 36గంటల ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూటీఎఫ్‌ దశల వారీ పోరాటం ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.మణిగండన్‌, రాష్ట్రకార్యవర్గ సభ్యులు టి.రఘుపతిరెడ్డి, సహధ్యక్షులు రహనా బేగం, కోశాధికారి కె.ప్రసన్న కుమార్‌, జిల్లా కార్యదర్శులు కె.రెడ్డెప్ప నాయుడు, ఏ.కష్ణమూర్తి, గాలి సురేష్‌, డి.ఏకాంబరం, బి.ఈశ్వర్‌ మహేంద్రా, పంటపల్లి సురేష్‌, ఎం.పార్థసారథి, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ పిసి.బాబు, రాష్ట్ర కౌన్సిర్లు సిప.ప్రకాష్‌, ఎస్‌పి.బాషా, టి.బాలాజీ పాల్గొన్నారు.

➡️