ఉద్యోగులకు, మధ్యతరగతి కుటుంబాలకు వరంజగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌

Dec 14,2023 22:44
ఉద్యోగులకు, మధ్యతరగతి కుటుంబాలకు వరంజగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌

మార్కెట్‌ విలువకన్నా తక్కువకే అందజేత..భూమి పూజ కార్యక్రమంలో మంత్రి ఆర్కేరోజాప్రజాశక్తి- నగరి: మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగులకు కూడా సొంతింటి కలను సాకారం చేయడానికి మార్కెట్‌ విలువ కంటే తక్కువకే ప్లాట్లు అందించేందుకు జగనన్న సర్కార్‌ తీసుకున్న నిర్ణయమే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ అని మంత్రి ఆర్కేరోజా అన్నారు. గురువారం కీళపట్టు శివారుల్లో చిత్తూరు- తచ్చూరు జాతీయ రహదారిని ఆనుకొని ఏర్పాటుచేయనున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌కు ఆమె భూమిపూజ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్న సంకల్పంతో ఏకంగా 31లక్షల ఇళ్లపట్టాలు పేదవాళ్లకు ఇప్పటికే పంపిణీ చేశామని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగులకు సొంతింటి కలను సాకారం చేయడానికి జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తుడావారే ప్లాటను అభివద్ధి చేసి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా సులభమైన రీతిలో బ్యాంకు రుణాలు పొంది నిర్మాణాలు చేపట్టుకునేలా ప్లాట్లు అందించడం జరుగుతుందన్నారు. 18లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్న వారు జగనన్న టౌన్‌షిప్‌లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లింపులు చేయవచ్చన్నారు. ప్లాట్ల నిర్ణీత విలువలో మొదట 10 శాతం చెల్లించి అగ్రిమెంటు వేసుకోవాలని తరువాత నెలరోజుల్లో 30 శాతం, ఆరునెలల్లో 30శాతం, ఏడాది లోపు మిగిలిన 30 శాతం చెల్లిచాలన్నారు. చెల్లింపులు పూర్తికాగానే డెవలప్‌చేసిన ప్లాట్లను రిజిష్టరు చేసి చేతికి అందిస్తారన్నారు. పీఆర్సీ సందర్భంగా ఉద్యోగులకు మాట ఇచ్చిన మేరకు 10 శాతం ప్లాట్లను ఉద్యోగులకు రిజిర్వు చేస్తూ 20శాతం రిబేటుతో అందిస్తామన్నారు. ఆక్షన్‌లో పాల్గొనే పెన్షనర్లకు 5 శాతం రిజిర్వు చేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తులు తుడా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ద్వారా చేసుకోవాలన్నారు. పూర్తిపారదర్శకతతో కులం, మతం, ప్రాంతం, పార్టీలతో సంబందం లేకుండా ప్లాట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. లేఅవుట్‌ స్థలంలో 50శాతం స్థలం ఉమ్మడి అవసరాలైన పార్కులు, ప్లేగ్రౌండ్స్‌, స్కూళ్లు తదితర అవసరాలకు కేటాయించడం జరుగుతుందన్నారు. 40 నుంచి 60 అడుగుల వెడల్పు గల రోడ్లతో మౌలిక వసతులతో ప్లాటు అందిస్తామని ఒకే విడతలో పూర్తి మొత్తం చెల్లించే వారికి 10 శాతం తగ్గింపు కూడా ఉంటుందన్నారు. తుడా డీఈ రవీంద్ర, ఏఈ విజయశేఖర్‌, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు రాజేష్‌, నీలకంఠం, కౌన్సిలర్‌ అణ్ణెమ్మ, యాకోబు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

➡️