డ్రైవర్లుగా మారిన శానిటరీ ఇన్స్పెక్టర్

డ్రైవర్లుగా మారిన శానిటరీ ఇన్స్పెక్టర్

డ్రైవర్లుగా మారిన శానిటరీ ఇన్స్పెక్టర్లుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: మున్సిపల్‌ అవుట్సోర్సింగ్‌ కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో పారిశుద్ధ్య పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయా పనులు చేయించాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ బుధవారం ఉదయం నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. నగరపాలక సంస్థ వాహనాల షెడ్డును పరిశీలించిన కమిషనర్‌ చెత్త తరలించే వాహనాలపై అధికారులతో చర్చించారు. చెత్త తరలించే వాహనాలకు సరిపడా డ్రైవర్లను సమకూర్చాలని తెలిపారు. ఇందుకోసం డ్రైవింగ్‌ అర్హతలున్న డ్వాక్రా మహిళల భర్తలను డ్రైవర్లుగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం ఉదయం శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, లోకనాథం చెత్త తరలించే వాహనాలకు డ్రైవర్లుగా వ్యవహరించారు. మరో ఇన్చార్జి ఇన్స్పెక్టర్‌ నరసింహ లోడర్‌ అవతారం ఎత్తారు. అనంతరం కమిషనర్‌ కట్టమంచి పరిధిలో లాయర్స్‌ కాలనీ, రెడ్డిఅండ్‌రెడ్డి కాలనీలో పారిశుధ్య పనులను పరిశీలించారు. నగరంలో ఎక్కడా వ్యర్ధాలు ఉండరాదని, నిర్దేశించుకున్న ప్రత్యామ్నాయ ప్రణాళిక ద్వారా అందుబాటులో ఉన్న రెగ్యులర్‌ వర్కర్లతో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేయించాలన్నారు. ఔట్సోర్సింగ్‌ కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు నగర ప్రజలు తమవంతుగా సహకరించాలని కమిషనర్‌ పిలుపునిచ్చారు. నగరంలోని ఎన్జీవో సంఘాలు తమవంతు సహకారం అందించేందుకు ముందుకు రావాలన్నారు. సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, నరసింహ, లోకనాథం పాల్గొన్నారు.

➡️