తాడోపేడో తేల్చుకుంటాం..

Jan 2,2024 21:47

అంగన్వాడీల పోరాటం ఉధృతం
నేడు కలెక్టరేట్‌ ముట్టడి
22వ రోజు దున్నపోతుకు వినతులు ఇస్తూ నిరసన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 22 రోజులు పాటు శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ప్రభుత్వంతో తాడోపేడో తెచ్చుకొనేందుకు సిద్ధమైయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు న్యాయమైన సమస్యలు పెట్టినా ప్రధాన డీమాండ్లు జీతాల పెంపు, గ్రాట్యుటీ అమలు విషయంతో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. కలెక్టరేట్‌ ముట్టడికి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల నుండీ అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు సన్నర్థం అవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జీతాల పెంపు, గ్రాట్యుటీ చెల్లించాలంటున్నారు. మూడు యూనియన్ల పిలుపు మేరకు గతేడాది డిసెంబర్‌ 12వ తేది నుండీ రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించి సమ్మెను కొనసాగిస్తున్నారు. వివిధ రూపాల్లో వినూత్న రీతిలో శాంతియుతంగా పోరాటాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మూడు దఫాలు చర్చలు జరిపినా ప్రధాన డిమాండ్ల జీతాలు పెంపు, గ్రాట్యుటీ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. జీతం బెత్తెడు.. చాకిరి బారెడు.. స్త్రీ శిశు సంక్షేమశాఖ ద్వారా నడుస్తున్న అంగన్వాడీ సెంటర్లలో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవవేతనం పేరుతో ఇస్తున్న జీతం బెత్తెడు.. చారికీ బారెడుగా ఉంటోంది. సిఐటియు యూనియన్‌ ఏర్పాటు చేసుకున్న అంగన్వాడీలు రూ.2000ల వేతనం నుండీ పోరాటాల ద్వారా వర్కర్లు రూ.11,500 హెల్పర్ల రూ.7వేలకు జీతం పెంచుకున్నారు. ప్రభుత్వం అందించే జీతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పొచ్చుకుంటే ఏమాత్రం సరిపోదు. 2019 ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా తెలంగాణా కంటే అదనంగా వెయ్యి రూపాయులు జీతం పెంచి ఇస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జీతాలు పెంచి, ప్రభుత్వ సంక్షేమ పధకాలకు అంగన్వాడీలను అర్హులుగా ప్రకటించడంతో పాటు కొన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుతున్నారు. అర్హత కలిగిన మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా మార్చాలని కోరుతున్నారు. సమ్మెను విచ్ఛినం చేసే ప్రయత్నం సమస్యల సాధనకోసం వీరోచితంగా పోరాడుతున్న అంగన్వాడీల సమ్మెను విచ్ఛినం చేసేలా ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తోంది. అంగన్వాడీ సెంటర్లను బలవంతంగా తెరిపించడం, పోటీగా సచివాలయ సిబ్బందిని నియమిండం, ఐసిడిఎస్‌ అధికార్ల ద్వారా బెదిరింపులకు పాల్పొడుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అంగన్వాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కలెక్టరేట్‌ ముట్టడిని భగం చేసేలా ఈనెల 5వ తేదీలోపుగా విధులకు హాజరుకాకుంటే విధుల నుండీ లొలగిస్తామంటూ అల్మిమేటం జారీచేసింది. ఐదేళ్ళపాటు జగన్‌ ఇచ్చిన మాటప్రకారం జీతాలు పెంచుతారని ఆశించిన అంగన్వాడీలు ఐదేళ్ళ తరువాత ప్రత్యక్ష పోరాటానికి పూనుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు పూనుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఎంత నిర్భందించాలని ప్రయత్నించినా కలెక్టరేట్ల్‌ ముట్టడిని విజయవంతం చేయాలనే దృఢనిచ్ఛయంతో జిల్లా వ్యాప్తంగా కదులుతున్నారు.
యాదమరి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంలో ఆలస్యం అవుతున్న సందర్భంగా జనవరి 3వ తేదీ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడిస్తామని అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు షకీలా తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని యాదమరి తహశీల్దార్‌ కార్యాలయం ముందు సమ్మె 22వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా సమస్యలు పరిష్కారం కాకుండా సమ్మె విరమించేది లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
బైరెడ్డిపల్లి: మండల పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ తమ డిమాండ్‌ పరిష్కరించాలని దున్నపోతుకు వినతి సమర్పించిన వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బైరెడ్డిపల్లి ప్రాజెక్ట్‌ అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సమ్మెకు జిల్లా వ్యవసాయ కార్మిక సభ్యులు ఓబుల్‌ రాజ్‌ సమ్మెకు మద్దతు ప్రకటించారు. నేడు జరుగనున్న కలెక్టరేట్‌ ముట్టిడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పలమనేరు: నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్స్‌ 22వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్‌ తమ వినతిపత్రాన్ని ఒక దున్నపోతుకు సమర్పించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్రను వదిలి తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని విన్నవించారు.

➡️