పతాకస్థాయికి సమ్మె,, తగ్గేదే లే!

Dec 14,2023 22:50
పతాకస్థాయికి సమ్మె,, తగ్గేదే లే!

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ న్యాయమైన డిమాండ్‌ సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం విఫలయత్నం చేస్తోంది. సంఘమిత్రలు (వీవోఏ) ద్వారా సెంటర్లను నడపాలని ప్రయత్నించినా అందుకు వివోఏలు అంగీకరించకపోవడతో రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మిన బంటుల్లా పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది రంగంలోకి దింపింది. జిల్లాలో అక్కడక్కడా తహశీల్దార్లు, ఎంపిడిఒలు సచివాలయ సిబ్బందిని వెంటబెట్టుకొని బలవంతంగా అంగన్వాడీ సెంటర్ల తాళాలను పగులగొట్టి సెంటర్లలోకి ప్రవేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లోకి నాలుగు గంటల తరువాత ప్రవేశించడం, తాళాలు బద్ధలు కొట్టడం చట్టవిర్ధుమంటూ అంగన్వాడీ యూనియన్‌ నేతలు, అంగన్వాడీలు, లబ్దిదార్లు అడ్డుకొనే ప్రయత్నం చేసినా ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. ఇదే తీరుగా ప్రభుత్వం చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు నేతలు అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే చట్టవ్యతిరేకంగా సమ్మెలో ఉన్న అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోవగా పోటీగా సచివాలయ సిబ్బంది ద్వారా సెంటర్లను బలవంతంగా తెరవడం, ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తించడం పట్ల జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడురోజుల పాటు జిల్లాలోని 11ప్రాజెక్టులో ప్రశాంతంగా సాగిన అంగన్వాడీల సమ్మె ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా సెంటర్లను సచివాలయ సిబ్బంది ద్వారా బలవంతంగా తెరిపించే ప్రయత్నం చేయడంతో ఉధృత్తంగా మారింది. ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్భాందాలతో అంగన్వాడీల పోరాటాన్ని అడ్డుకోలేరని అంగన్వాడీల పోరాటం ఏపాటిదో గతంలో అనేక సందర్భాల్లో నాటి ప్రభుత్వాలకు చాటిచెప్పిన అంగన్వాడీలు తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదని, వెనక్కి తగ్గేదేలేదని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సాగుతున్న సమ్మెను విచ్ఛినం చేసేలా ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. అంగన్వాడీల మూడోరోజు సమ్మెలో జిల్లాలోని చిత్తూరు, జీడినెల్లూరు, ఐరాల, బంగారుపాళ్యం, యాదమరి, కార్వేటినగరం, నగరి, కుప్పం, శాంతిపురం, వీకోట, పుంగనూరు, పలమనేరుతో పాటు ఇతర ప్రాంతాల్లో వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీలు, హెల్పర్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కుప్పంలో మానవహారం నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహానికి విన్నతి పత్రం అందించారు. అంగన్వాడీల పోరాటానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. యాదమరి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు తమ హక్కుల సాధనకై సమ్మెను ఉధతం చేస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని చాటుకుంటున్నది, సచివాలయ ఉద్యోగులు దౌర్జన్యంగా అంగన్వాడీ సెంటర్లు తాళాలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్‌కు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు. దీంతో మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు గ్రామపంచాయతీ కార్యదర్శులు తాళాలు పగలగొడుతూ మరో తాళం వేస్తున్నారు. బంగారుపాళ్యం: అంగన్వాడీల సమ్మె మూడో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్‌ మండల అధ్యక్షులు వరలక్ష్మీ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, అంగన్వాడీలపై రాజకీయ ఒత్తిళ్లు తగ్గించాలని, సమానపనికి సమానవేతనం ఇవ్వాలని, యాప్‌ల భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. వీరికి తెలుగుదేశం మండల ఉపాధ్యక్షులు కమలనాథ్‌రెడ్డి, కోదండ యాదవ్‌, వంశీచౌదరి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలు రత్నకుమారి, భారతి, శశికళ, లక్ష్మీ, రాధిక, సరస్వతి పాల్గొన్నారు. కుప్పం: పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ప్రారంభించిన నిరవధిక సమ్మె గురువారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా అంగన్వాడీలు ఐసిడిఎస్‌ కార్యాలయం నుండి బస్టాండ్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్‌ కూడలి వద్ద డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి తమ సమస్యలు పరిష్కరిం చాలంటూ వినతిపత్రాన్ని సమర్పించి బస్టాండ్‌ కూడలిలో మానవహారం నిర్వహించారు.పుంగనూరు: అంగన్వాడీలు చేస్తున్న న్యాయబద్ధమైన సమ్మెకు పుంగనూరు తెలుగుదేశం, జనసేన పార్టీలు పూర్తి మద్దతును తెలియజేస్తూ సమ్మెలో పాల్గొన్నారు. రాంపల్లి సమీపంలో ఉన్న ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీల యూనియన్‌ ఆధ్వర్యంలో మూడవరోజు సమ్మె గురువారం నిర్వహించారు. అంగన్వాడీలు ప్రేమ్‌ కుమారి, పద్మ, వీణ, శోభ, టిడిపి రూరల్‌ పార్టీ అధ్యక్షులు గంగసాని మాధవరెడ్డి, నాయకులు సివిరెడ్డి, ఆసూరి బాలాజీ, చిన్న మోహన, ప్రసాద్‌, మాజీ ఎంపీటీసీ గంగులప్ప, జనసేన నాయకులు చిన్న రాయల్‌, పగడాల రమణ పాల్గొన్నారు. గంగాధర నెల్లూరు: అంగన్వాడీల న్యాయమైన సమస్యలను రాష్ట్రప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల యూనియన్‌ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాలకు చెందిన గంగాధర నెల్లూరు, పాలసముద్రం, పెనుమూరు అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది సమ్మె లో పాల్గొన్నారు. అదేవిధంగా అంగన్వాడీల సమ్మెకు టిడిపి నేతలు ఎర్రగుంట్ల క్రిష్టమనాయుడు, శ్రీధర్‌యాదవ్‌, వెంకటేష్‌, స్వామిదాస్‌, దేవసుందరం, జ్యోతి యాదవ్‌, కామసాని కోదండరెడ్డి, కార్జాల అరుణ, తలారి రెడ్డెప్ప, రాంబాబు రెడ్డి, చెంగల్రాయ యాదవ్‌ పాల్గొని మద్దతు తెలిపారు.నగరి: అంగన్వాడీల సమ్మె గురువారం మూడవరోజు కొనసాగుతుంది. నగరి ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు బైటాయించి తమ న్యాయమైన కోర్కెలు కోసం నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా అంగన్వాడీ సెంటర్లను బలవంతంగా తెరవడం మానుకోవాలని, తెరిస్తే అడ్డుకుంటామని యూనియన్‌ నాయకులు ధనకోటి మునెమ్మ, ఏఐటియుసి జిల్లా ప్రధానకార్యదర్శి కోదండయ్య హెచ్చరించారు. అంగన్వాడీలు విజయ, ధనకోటి, వరలక్ష్మీ, మునెమ్మ, కస్తూరి, శాంతి, భవాని పాల్గొన్నారు.

➡️