హామీలకు ‘ఉరి’

Jan 2,2024 22:51
హామీలకు 'ఉరి'

శ్రీ 14వ రోజూ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె శ్రీ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగించాలిశ్రీ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు పిలుపుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె రాష్ట్రవ్యాప్తంగా 14వ రోజు కొనసాగింది. మంగళవారం చిత్తూరు కలెక్టరేట్‌ శిబిరం వద్ద భారీగా ఉద్యోగులు మెడకు ఉరి వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలు గడిచినా విద్యాశాఖలో పనిచేసే సమగ్ర శిక్ష ఉద్యోగులను పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని అన్నారు. విద్యా కార్యక్రమాలు నిర్వహించడంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు కీలకపాత్ర వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కష్టజీవుల సమస్యలను పట్టించుకోవడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. 18 విభాగాల్లో పనిచేస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు పని ప్రాధాన్యత ఎక్కువగా ఉందని వారి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు ధైర్యంగా ఐక్యంగా పోరాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహవరించకుండా కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే వీరి పోరాటానికి అన్ని ప్రజాసంఘాలు మద్దతు కూడగడతామని తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మెను కొనసాగించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘ నాయకులు శ్రీనివాసులు, వేలాయుధం, నారాయణ, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️