పింఛన్ల పంపిణీ పై వదంతులను నమ్మవద్దు

Apr 3,2024 22:34
పింఛన్ల పంపిణీ పై వదంతులను నమ్మవద్దు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: నగరపాలక సంస్థ పరిధిలో మొదటి రోజే 71శాతం పింఛన్ల పంపిణీ విజయవంతంగా జరిగింది. నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ ఉదయం బ్యాంకుల్లో నగదు విత్‌ డ్రా చేయడం దగ్గర నుండి వార్డు సచివాలయాల్లో లబ్ధిదారులకు పింఛను సొమ్ములు పంపిణీ చేయడం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. వార్డు సచివాలయాల్లో లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, కుర్చీలు, అవసరమైన ప్రాంతాల్లో షామియానాలు వేయించారు. కమిషనర్‌ బుధవారం ఉదయం ఐసిఐసిఐ బ్యాంకుకు వెళ్లి బ్యాంకు అధికారులతో మాట్లాడారు. పింఛన్‌ సొమ్ములు వేగంగా అందించాలని సూచించారు. అనంతరం సూపర్వైజర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సూపర్వైజర్‌ అధికారులు వారికి కేటాయించిన వార్డుల్లో ఉంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు పింఛన్‌ అందేలా పర్యవేక్షించాలన్నారు. మధ్యాహ్నం కమిషనర్‌ పలు వార్డు సచివాలయాల్లో పర్యటించి పింఛను సొమ్ముల పంపిణీని పరిశీలించారు. దొడ్డిపల్లిలో లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్ములను అందించారు. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారులందరికీ పింఛను అందజేయడం జరుగుతుందన్నారు. వార్డు కార్యదర్శులు సచివాలయాల్లో అందుబాటులో ఉంటారని లబ్ధిదారులు వారికి కేటాయించిన సమయంలో వచ్చి పింఛన్‌ సొమ్మును పొందవచ్చన్నారు. కాగా నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 16,698 పింఛన్లకు గాను మొదటిరోజు 11,782 (సాయంత్రం 7గంటలకు) పింఛన్లను పంపిణీ చేశారు. మిగిలిన పింఛన్లను గురువారం నాటికి పూర్తి చేయాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంఎం గోపి, ఇతర అధికారులు పాల్గొన్నారు.బంగారుపాళ్యం: సచివాలయాల ద్వారా సామాజిక పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు సచివాలయ కార్యదర్శి దుర్గాప్రసాద్‌ తెలిపారు. బుధవారం మండలంలోని సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

➡️