పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ

May 7,2024 00:52

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పల్నాడు రోడ్డులోని ఎస్‌.ఎస్‌.ఎన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద సోమవారం ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి నరసరావుపేటకు చెందిన సత్యనారాయణరెడ్డి పోలింగ్‌ కేంద్రం బయట ఉన్న టిడిపి వారిని మీకు ఇక్కడ ఏం పని అని ప్రశ్నించారు. అతని సెల్‌ఫోన్‌కు జగన్‌ బొమ్మ ఉండడం తమను ప్రశ్నించడాన్ని తట్టుకోలేక ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు సత్యనారాయణ రెడ్డిని దూషించి దాడి చేసేందుకు ప్రయత్నించారు. కారులో ఎక్కించుకొని కొంత దూరం తీసుకువెళ్లి ఆర్మీ ఉద్యోగి అని తెలిసి తిరిగి మళ్లీ పోలింగ్‌ కేంద్రం వద్ద దిగబెట్టారు. ఈ లోగా తనపై కారులో ఉన్న వ్యక్తులు పిడి గుద్దులు గుద్దారని సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. దీంతో వైసిపి గ్రూపు పోలింగ్‌ కేంద్రం ఎదురుగా ఉన్న వైసిపి పార్లమెంట్‌ కార్యాలయంలో గుమిగూడి ఉన్న వైసిపి నాయకులు కార్యకర్తలు కర్రలతో రాళ్లతో ఒక్కసారిగా టిడిపి శ్రేణులపైకి దూసుకువచ్చారు. ఇరు గ్రూపులు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో సత్తెనపల్లి కూటమి టిడిపి అసెంబ్లీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అనుచరుని కారును వైసిపి నాయకులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న టిడిపి ముఖ్య నాయకులు పోలింగ్‌ కేంద్రం వద్దకు వస్తున్న క్రమంలో వైసిపి శ్రేణులు వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. పోలీసులు సిఆర్పిఎఫ్‌ బలగాలు ఇరు పక్షాలను చెదరగొట్టాయి.అరవిందబాబుపై కేసు నమోదు చేయాలి : గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డివిషయం తెలుసుకున్న వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రొంపిచర్ల మండలంలో ఎన్నికల ప్రచారం మధ్యలో ముగించుకొని పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. పోలింగ్‌ కేంద్రం వద్ద సరైన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమైయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద విశ్రాంత ఉద్యోగిపై టిడిపి శ్రేణులు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నియోజకవర్గ ఎన్నికల అధికారి పి.సరోజినిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. టిడిపి నాయకులు కార్యకర్తలు రెచ్చిపోయి వివాదాలు సృష్టిస్తే సహించేది లేదన్నారు. టిడిపి అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ప్రోత్సాహంతోనే వివాదం చెలరేగిందని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా విశ్రాంత ఉద్యోగి టిడిపి శ్రేణులను దూషించి దుర్బాషలాడారని దీంతో స్వల్ప వివాదం చోటుచేసుకుందని పోస్టల్‌ బ్యాలెట్‌ లో 75 శాతంపైగా టిడిపి అనుకూలంగా ఉండడంతో ఓర్చుకోలేక తమపై అనవసరంగా దాడి చేశారనిచదలవాడ అరవిందబాబు అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసిపి శ్రేణులకు అండగా ఉంటూ టిడిపి నాయకులు కార్యకర్తలపై దాడిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

➡️