షెడ్డు కార్మికులపై సిఎం వ్యాఖ్యలు దారుణం

Apr 17,2024 00:07

విలేకర్లతో మాట్లాడుతున్న పి.బాలకృష్ణ
ప్రజాశక్తి – మంగళగిరి :
వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం షెడ్‌ కార్మికులకు వర్తింపజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇటీవల సికె కన్వెన్షన్‌లో జరిగిన చేనేతల సమావేశంలో కోరగా అది కుదరదని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం సరికాదని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు స్థానిక చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో మంగళవారం నాయకులు జె.శివభావన్నారాయణతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. షెడ్‌ కార్మికులు ఎప్పుడు ఎక్కడ మగ్గం నేస్తారో తెలియదని, అందువలన నేతన్న నేస్తం వర్తింపచేయం అని సిఎం మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి మంగళగిరిలో దీక్ష చేసినప్పుడు చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగంలో దెబ్బతీసే విధంగా విధానాలున్నాయని విమర్శించారు. ఏడాదికి బడ్జెట్లో రూ.2 వేలకోట్లు చేనేత కార్మికులకు కేటాయిస్తామని చెప్పి కేటాయించలేదని విమర్శించారు. సొంతి ల్లు లేక అద్దె ఇట్లో ఉంటూ ఆదాయంలో సగం ఇంటి అద్దెలకు పోగా కుటుంబాలు గడవడం కష్టమైన చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. మంత్రి ఆర్కే రోజా పవర్‌లూమ్‌ వస్త్రాలు తీసుకొచ్చి ఆప్కోలో అమ్మారని విమర్శించారు. సీఎం జగన్‌ మాట్లాడేటప్పుడు పక్కనే ఉన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడకపోవడం దారుణమన్నారు. చేనేతను రక్షిస్తానని చెప్పి ముఖ్యమంత్రి బక్షిస్తున్నారని విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండియా బ్లాక్‌ వేదిక అభ్యర్థిగా పోటీ చేస్తున్న జొన్న శివశంకరరావును గెలిపించాలని కోరారు.

➡️