రక్తహీనతపై శ్రద్ధ వహించాలి : కలెక్టరు

May 22,2024 20:57

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌  : రక్త హీనతపై శ్రద్ద వహించాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరు క్యార్యాలయ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గర్భిణుల్లో రక్తహీనత, ప్రసవ మరణాలు, తల్లీబిడ్డల నమోదు, ఎబిహెచ్‌ఎ యాప్‌ నమోదు, ఆసుపత్రి ప్రసవాలు, బర్త్‌ ప్లానింగు, కంటివెలుగు, 108 వాహనాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టరు మాట్లాడుతూ గర్భిణుల్లో రక్తహీనత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రక్తహీనత గల గర్భిణులకు అందించిన సేవలపై సమీక్ష నిర్వహించి నివేదిక అందించాలని తెలిపారు. మండల అభివృద్ధి అధికారులు, మహిళాశిశుసంక్షేమశాఖ అధికారులు, వైద్యసిబ్బంది తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ప్రసవ, మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయాలని తెలిపారు. ఆసుపత్రుల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం చూపించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలకుండా దోమలు నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 400 గ్రామాల్లో స్ప్రేయింగు చేయాలని, స్ప్రేయింగుకు సరైన పద్దతిలో సంబంధిత అధికారుల పర్యవేక్షణలో జరగాలని తెలిపారు. ఇందుకు స్థానికులు, ఉద్యోగులు సహకారం తీసుకొని సమన్వయంతో పూర్తిచేయాలన్నారు. డెంగీ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందని, డ్రైడే తప్పని సరిగా పాటించాలని తెలిపారు. కాలువల్లో పూడికతీత, బహిరంగ స్థలాల్లో నీరు నిల్వలేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్యఆరోగ్య అధికారి డాక్టర్‌ కె.విజయపార్వతి, డిఐఒ డాక్టర్‌ ఎం.నారాయణ, ఇతర అధికారులు డాక్టర్‌ ఎం.వినోద్‌, డాక్టర్‌ శివకుమార్‌, డాక్టర్‌ డిఎల్‌ఆర్‌ రఘుకుమార్‌, డాక్టర్‌ టి.జగన్మోహన రావు, మెడికల్‌ ఆఫీసర్లు, సిహెచ్‌సి, పిహెచ్‌సి డాక్టర్లు పాల్గొన్నారు.

➡️