వసతి గృహంలో దెయ్యం

Jun 20,2024 22:02
ఫొటో : విద్యార్థులతో మాట్లాడుతున్న జెవివి నాయకులు

ఫొటో : విద్యార్థులతో మాట్లాడుతున్న జెవివి నాయకులు

వసతి గృహంలో దెయ్యం

– ఆందోళనలో విద్యార్థులు- నిజాలు నిగ్గు తేల్చిన జనవిజ్ఞాన వేదిక

ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : పట్టణంలో వెనుకబడిన తరగతుల కాలేజీ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న హాస్టల్‌లో ఇటీవల దయ్యం తిరుగుతుందని విద్యార్థులు హడలిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు పట్టణంలో కాలేజీ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వసతి గృహంలో ఏడాది కళాశాలలో తెరిచిన అనంతరం వసతి గృహాన్ని సైతం తెరిచారు. ప్రస్తుతం పది మందిలోపు విద్యార్థులు వసతి గృహంలో ఉన్నారు. వసతి గృహంలో వసతులు కరువైన పరిస్థితులలో విద్యార్థులు దెయ్యం ఉందని ప్రచారం చేశారు. ముగ్గురు విద్యార్థులకు రాత్రులలో దెయ్యం కనిపించిందని వారి స్వగృహాలకు పరుగులు తీశారు. రాత్రులందు దెయ్యం కేకలు వేస్తోందని సెల్‌ఫోన్‌లో సైతం ఆ కేకలను చిత్రీకరించారు. వసతి గృహంలో తాముండలేమని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విషయం వసతి గృహ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆత్మకూరు పట్టణానికి చెందిన జన విజ్ఞాన వేదిక బృందం దెయ్యం గురించి విచారించేందుకు వెళ్లి అక్కడ పరిస్థితుల్లో పరిశీలించారు. జన విజ్ఞాన వేదిక ఆత్మకూరు మండల బృందం ఆ హాస్టల్‌ పరిస్థితులను పరిశీలించి విద్యార్థులతో సంభాషించి అసలు విషయాన్ని బహిర్గతం చేశారు. వసతి గృహంలో వసతులు సక్రమంగా లేని విషయాన్ని గుర్తించారు.అధికారులు స్పందించి వెంటనే వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. సుమారు 70మంది విద్యార్థులకు 4 లెట్రిన్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఉపయోగంలో ఉండేది రెండు మాత్రమే. ఉత్తరం వైపున ప్రహరీ గోడ లేకపోవుటతో పందులు యథేచ్ఛగా హాస్టల్‌ ఆవరణలోకి తిరుగుతుంటాయి. నీటి తొట్టెలు ఉన్న నీళ్లు పట్టే నాధుడు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాచ్‌మెన్‌ రాత్రులంతా సక్రమంగా ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాత్రులందు విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది కలిగితే పట్టించుకునే నాథుడు లేడని వాపోయారు. వసతి గృహం ఆవరణలో విద్యుత్‌ సౌకర్యాలు కూడా లేదు. రేకుల భవనం కావడంతో వాన పడినా ఎండకాసిన ఇబ్బందులే.కొన్ని రూములలో ఫ్యాన్‌లు లైట్లు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాల నుంచి విద్యార్థుల అవస్థలను గమనించి వారి కోసం ప్రభుత్వ హాస్టల్‌ భవనాన్ని నిర్మించాలని విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్‌ చేశారు.అయినప్పటికీ ఎటువంటి స్పందన అధికారుల వైపు నుంచి లేదు. పాలిటెక్నిక్‌ ఐటిఐ డిగ్రీ కళాశాలలలో చదివే విద్యార్థులకు నాసిరకమైన భోజనం చేసి పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. వసతులు లేని భవనాలు కేటాయించడం వల్ల వారి చదువు కొనసాగే అవకాశం లేదు. అధికారులు స్పందించాలని ఏర్పాట్లు చేయించాలని జన విజ్ఞాన వేదిక నాయకులు కోరారు. జన విజ్ఞాన వేదిక నాయకులు, జిల్లా సహాయ కార్యదర్శి హరికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, మండల అధ్యక్షులు వంటేరు మల్లికార్జున, సీనియర్‌ నాయకులు లక్కు కృష్ణప్రసాద్‌, షేక్‌ సందాని, సాదిక్‌ హుస్సేన్‌, షఫీ, అబ్దుల్‌ మునాఫ్‌, వాగాల శ్రీహరి, గద్దర్‌ బాబు, తదితరులున్నారు.

➡️