చందనోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయండి

చందనోత్సవం

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అవసరమగు సౌకర్యాలను త్వరితగతిన కల్పించాలని జివిఎంసి కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో జివిఎంసి అదనపు కమిషనర్‌ కెఎస్‌.విశ్వనాధన్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి చందనోత్సవ కార్యక్రమం ఏర్పాట్లుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 10వ తేదీన జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిమంది భక్తులు వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందీ కలగరాదని అన్నారు. భక్తులకు తాగునీరు, ఒఆర్‌ఎస్‌ పా్యకట్లు సమృద్దిగా అందించాలని, కొండపైన, కొండ దిగువున పలు ప్రాంతాలలో మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేసి, వాటికి నిరంతరం నీరు అందించేలా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. భక్తులకు రహదారి మార్గంలో ఎటువంటి అసౌకర్యమూ కలుగకుండా విద్యుత్‌ దీపాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రధాన ఇంజినీరు రవికృష్ణంరాజు, అదనపు కమిషనర్లు డాక్టర్‌ వై.శ్రీనివాసరావు డాక్టర్‌ వి.సన్యాసిరావు, పర్యవేక్షక ఇంజినీర్లు కెవిఎన్‌.రవి, వినరు కుమార్‌, శాంసన్‌ రాజు, రామ్మోహన్‌రావు, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

➡️