వాలంటీర్ల ‘రాజీ’ నామాలు

Apr 6,2024 21:43

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి: జిల్లాలో గ్రామ, వార్డు వాలంటీర్ల రాజీనామాలు చర్చ నీయాశంగా మారాయి. వాలంటీర్లంతా రాజీనామాలు చేయండి, తిరిగి వైసిపి అధికారంలోకి వస్తే తిరిగి అవకాశం కల్పిస్తాం అంటూ వైసిపి నాయకులు, అక్కడక్కడా అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. ఈ పిలుపును అందుకున్న వాలంటీర్లు అక్కడక్కడా రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు రాజకీయ ఒత్తిళ్లతో చేస్తున్నారు. రాజీనామాలు చేయడం ద్వారా ఎన్నికల్లో వైసిపికి మద్ధతుగా ప్రచారం చేయవచ్చనేది వారిభావన. కానీ, ఇలా రాజీనామాల వరకు వెళ్లినవారు ఎంత మంది? రాజీనామా చేయకపోతే వైసిపిపై అభిమానం లేనట్టేనా? ఆ మాటకొస్తే ఇంకా రాజీనామాలు చేయనివారే ఎక్కువ. ఈ లెక్కన వైసిపికే ఎక్కువ నష్టం జరుగుతుంది కదా? ఇదీ విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రస్తుతం పబ్లిక్‌ టాక్‌. వాలంటీర్ల ముసుగు తొలగించుకోండి అంటూ వైసిపి నేతలు బాహాటంగా చెప్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 15,478 మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు. వీరి నియామకం సమయంలో రాజకీయ జోక్యం ఉన్నప్పటికీ నూటికి నూరు శాతం వైసిపికి చెందినవారు అని చెప్పలేం. చాలా చోట్ల డబ్బులు తీసుకుని మరీ వాలంటీర్ల నియామకాలు చేశారు. బంధుత్వాల వల్ల కూడా టిడిపికి చెందినవారికి కొన్నిచోట్ల అవకాశం కల్పించాల్సి వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో వాలంటీర్లు కేవలం వైసిపి వైపు మాత్రమే ఉండే పరిస్థితి లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనేపథ్యంలోనే పార్వతీపురం జిల్లా వీరఘట్టం మండలం కిమ్మి, గడగమ్మ గ్రామాల్లో 28మంది వాలంటీర్లు శనివారం రాజీనామాలు చేశారు. ఇటు విజయనగరం జిల్లాలో పూసపాటిరేగ మండలంలో రెల్లివలస, కుమిలి సచివాలయాల పరిధిలో 77మంది, భోగాపురం మండలం సవరవిల్లి 18మంది చొప్పున వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అంతకు ముందు బొబ్బిలి పట్టణం 30వ వార్డులో 12మంది, విజయనగరంలోనూ నలుగురు రాజీనామాలు చేశారు. విజయనగరంలో 14మంది, ఎల్‌.కోట మండలం ఖాసాపేటలో ఒకరు, దత్తిరాజేరు మండలం వంగరలో ఒకర్ని చొప్పున ఎన్నికల నిబంధనవాళి ఉల్లంఘించినందుకు అధికారులు విధులనుంచి తప్పించారు. మొత్తంగా ఇప్పటి వరకు 200మంది లోపే రాజీనామాలు చేశారు. రాజీనామాల సంఖ్య ఇంకా పెరగొచ్చు. కానీ, ఇవేవీ రాజకీయాలను ఊహకు అందని రీతిలో ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుందా? ఇదే నిజమైతే ఎవరి పాలనలో ఎక్కువ ఉపాధి అవకాశాలు దొరికితే వారికే ఎక్కువ మంది పనిచేస్తారు. ఈలెక్కన టిడిపి సుదీర్ఘ ప్రయాణంలో దశాబ్ధాలు తరబడి పాలించింది. ఆయా సందర్భాల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నవారంతా ఆ పార్టీకే ఓట్లు వేస్తారా? అన్నది చాలా మంది నోట వినిపిస్తున్నమాట. కాబట్టి ఇటువంటి రాజీనామాలు మాంసం తిన్నామని చెప్పుకోవడం కోసం దుమ్ములు మెడలో కట్టుకోవడం వంటిదే అనేది పబ్లిక్‌ టాక్‌.

➡️