ముమ్మరంగా కాంగ్రెస్‌ ప్రచారం

May 10,2024 21:32

ప్రజాశక్తి – విజయనగరం కోట ; విజయనగరం పార్లమెంట్‌ ఇండియా వేదిక అభ్యర్థి బొబ్బిలి శ్రీను ప్రచారం ముమ్మరం చేశారు. ప్రధాన కూడలిలో ర్యాలీలు, సభలు నిర్వహించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాత్రి పగలూ తేడా లేకుండా వీధి వీధిన ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా వేదిక తరఫున పోటీ చేస్తున్న తనకు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను గెలిచిన వెంటనే మధ్యలో నిలిచిపోయిన అనేక అభివృద్ధి పనులను పూర్తి చేస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి చేసే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదాపైనేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌, విశాఖ రైల్వే జోన్‌, రైతులకు మేలు చేకూరే అనేక పథకాలను తీసుకొస్తామన్నారు. దేశం అభివృద్ధి బాటలో పయనించాలంటే అది ఒక కాంగ్రెస్‌ వల్లే సాధ్యమన్నారు. జాతీయ సంపదను ఆనాడు దేశ నాయకులు అనేకమంది కూడా పెడితే ఈనాడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదాని, అంబానీ వంటి అనేక కార్పొరేట్‌ శక్తులకు ధారాధత్తం చేస్తున్నారన్నారు. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అధికారమన్నారు. ఉపాధి హామీ వంటి చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. వామపక్షాల సహకారంతో ఇండియా వేదిక మద్దతుతో పోటీ చేస్తున్న తనను ప్రతి ఒక్కరూ ఆశీర్వాదించాలని విజయనగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

➡️