నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలి

May 23,2024 21:33

ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్‌ : తోటపల్లి రిజర్వాయర్‌ సమీపంలో ఉన్న పంపుహౌస్‌కు నిరంతరం విద్యుత్తు సరఫరా జరిగేలా కొత్త లైన్‌ను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌ విద్యుత్తు శాఖ అధికారులకు సూచించారు. గురువారం మున్సిపల్‌ డిఇ పి.కిరణ్‌కుమార్‌, ఎఇ జి.ఆనంద్‌, విద్యుత్తు శాఖ అధికారులతో కలిసి తోటపల్లి వద్ద ఉన్న పంప్‌ హౌస్‌ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ విద్యుత్‌ శాఖ అధికారులతో మాట్లాడుతూ పంపుహౌస్‌కు ప్రస్తుతం ఉన్న విద్యుత్తు కనెక్షన్‌ వల్ల ఎప్పటికప్పుడు సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. దీని కారణంగా పంపుహౌస్‌లో ఉన్న మోటార్లు ద్వారా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. పట్టణంలో పలు వార్డులకు సకాలంలో తాగునీటి సరఫరాలో జాప్యం తలెత్తుతోందని తెలిపారు. పంప్‌హౌస్‌కు అదనంగా ఇంకొక విద్యుత్తు కనెక్షన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన విద్యుత్తు శాఖ అధికారులు కొత్త లైన్‌ ఇచ్చేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. సమన్వయంతో పనిచేయాలిపార్వతీపురం టౌన్‌ : సచివాలయాల సెక్రటరీలు, తాగునీటి విభాగం సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌ సూచించారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో సచివాలయాల సెక్రటరీలు, తాగునీటి విభాగం సరఫరా సిబ్బందితో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వార్డుల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో మీ సచివాలయ పరిధిలో ఉన్న వార్డుల్లో పర్యటించి తాగునీటి సరఫరాలో జరిగే అంతరాయాన్ని గుర్తించాలని చెప్పారు. సమావేశంలో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ డిఇ పి.కిరణ్‌ కుమార్‌, జి.ఆనంద్‌, సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️