మొక్కజొన్నకు మద్దతుధర ఇవ్వాలి : సిపిఎం

May 17,2024 21:09

 ప్రజాశక్తి – కొమరాడ : మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించి, ఆ రైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని దలైపేట, వన్నం, పాలెం, కొట్టు తొడుము, కొమరాడ, కుమ్మరగుంట, దుగ్గి, గుణానుపురం, కల్లికోట, కంభవలస తదితర గ్రామాల్లో మొక్కజొన్న విస్తారంగా సాగైందన్నారు. అయితే పంటకు మాత్రం మద్దతు ధర లభించలేదన్నారు. పంటను రైతులు కళ్లాలకు తీసుకొచ్చి 15 రోజులైన కొనేవారు లేక దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదే సమయంలో ఒకవైపు వాన భయం, మరోవైపు ఏనుగుల భయంతో రైతులు రాత్రీ పగలు కళ్లాల్లో కాపలా కాస్తున్నారన్నారు. ప్రభుత్వం కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో రైతులు ఎవరికి అమ్మాలో తెలియని అయోమయం పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇదే అదునుగా దళారీలు తక్కువ రేటుకు అడుగుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మార్క్ఫెడ్‌ అధికారుల ద్వారా అన్ని గ్రామాల్లో పర్యటించి మొక్కజొన్న రైతులకు న్యాయం జరిగేలా వంద కేజీల మొక్కజొన్న పిక్కలను రూ.3వేలకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

➡️