ప్రజా సమస్యలను పరిష్కరించే వారినే గెలిపించాలి : సీపీఎం

Apr 9,2024 17:44 #Rampachodavaram

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ప్రజా సమస్యలను పరిష్కరించే, ప్రజా అనుకూల, ప్రత్యామ్నాయ విధానాల కోసం సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్‌, సీపీఎం ఉమ్మడి రంపచోడవరం నియోజకవర్గ సీపీఎం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు కోరారు. సిపిఎం మండల నాయకులు కొండ్ల సూరిబాబు అధ్యక్షతన మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు మాట్లాడుతూ 2014 నుండి అధికారంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌ ,డీజిల్‌ ,వంటగ్యాస్‌ ధరలు ధరలు రెట్టింపు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌లు నరేంద్ర మోడీకి లెఫ్టు, రైటుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా ఆయా ప్రాంతాలలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం రమేష్‌,జె రాజు,పి సత్యనారాయణ, పాండవుల సత్యనారాయణ, పి పాపారావు,కె జగన్నాధం, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

➡️