కార్మిక ద్రోహి మోడీని ఓడించండి

May 1,2024 21:52

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కార్మికుల పోరాట దీక్షా దినం మేడే స్ఫూర్తితో కార్మికవర్గ ద్రోహి బిజెపి ప్రభుత్వాన్ని, అందుకు సహకరిస్తున్న రాష్ట్రంలోని టిడిపి, జనసేన, టిడిపిలను ఎన్నికల్లో ఓడించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, నగర ఉపాధ్యక్షులు రెడ్డి శంకరరావు, అధ్యక్ష కార్యదర్శులు ఎ.జగన్మోహన్‌రావు, బి. రమణ, జిల్లా కార్యదర్శి యుఎస్‌ రవికుమార్‌ పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా బుధవారం నగరంలో కోట జంక్షన్‌వద్ద సిఐటియు జెండాను నాయకులు రెడ్డి శంకరరావు ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను, చట్టాలను నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్మికులకు కనీస వేతనాలు, 8గంటలు పని దినాలు అమలు జరగకుండా, కార్మిక సంఘాలు పెట్టకుండా కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తుందన్నారు. అన్ని రకాల నిత్యావసర ధరలు పెంచి పేదలు,సామాన్యులు బతకలేని పాలన సాగిస్తున్నారని అన్నారు. దేశానికి అన్నంపేట్టే రైతులను సైతం రోడ్డున పడేసే చట్టాలు తీసుకొస్తుందన్నారు. దేశాన్ని దోపిడీ దార్లుకు, పెట్టుబడి దారులకు దోచుకోవడానికి అనుగుణంగా పాలన సాగిస్తుందన్నారు. మేడే స్ఫూర్తితో హక్కులు సాధన కోసం,చట్టాలను కాపాడుకోవడం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద కోడూరు రామచంద్రరావు జెండా ఆవిష్కరించారు. ముఠా కళాసి వర్కర్స్‌ ఆధ్వర్యంలో డాబాతోట , ఎపి బేవరేజెస్‌లో రెడ్డి శంకర్రావు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి కోవెల వద్ద బి.రమణ, ఎల్‌బిజి భవనం వద్ద ఎ.జగన్మోహన్‌రావు, అంబేద్కర్‌ జంక్షన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, బాబా మెట్ట, దాసన్నపేట రింగ్‌ రోడ్డు, ఎస్‌విఎన్‌ నగర్‌ , మెడికల్‌ కళాశాల, ఎమ్మార్‌ హాస్పిటల్‌ ఆటో స్టాండ్‌లు, వ్యవసాయ విశ్వవిద్యాలయం తదితర చోట్ల జెండా ఆవిష్కరణలు జరిగాయి. కార్యక్రమంలో సిఐటియు నాయకులు త్రినాధ్‌, భాస్కర్‌ రావు, సింహాచలం, కృష్ణ, బుజ్జమ్మ, రాఘవ, రాము నాయుడు, నర్సింగరావు, లక్ష్మణరావు, రామచంద్రరావు, బుచ్చయ్య, ఐద్వా, డివైఎఫ్‌ఐ నాయకులు లక్ష్మి, సతీషు, ఆటో, హమాలి ,మెడికల్‌ రిప్‌లు, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు. ఐఎస్‌టియుసి ఆధ్వర్యంలో .. పిడబ్ల్యు మార్కెట్‌ లో ఐఎన్‌టియుసి ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మొదిలి శ్రీనివాసరావు హాజరై పతాక ఆవిష్కరణ చేశారు. మేడే విశిష్టతను కార్మికులకు వివరించారు.. ఈ సమావేశంలో ఐఎన్‌టియుసి అనుబంధ సంఘాలు నాయకులు, వివిధ జట్టు మేస్త్రిలు, కార్మికులు పాల్గొన్నారు.ఎఐఎఫ్‌టియు ఆధ్వర్యాన..మేడే అందించిన పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కులు,చట్టలు కాపడుకోవడం కోసం ఉద్యమించాలని ఎఐఎఫ్‌టియు నాయకులు బెహరా శంకరరావు, రెడ్డి నారాయణరావు పిలుపునిచ్చారు. ఆర్టీసి కాంప్లెక్స్‌ ఆటో స్టాండ్‌ వద్ద యూనియన్‌ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.

➡️