రాష్ట్రంలో రాక్షస పాలన : కళా

Apr 4,2024 21:35

ప్రజాశక్తి-చీపురుపల్లి  : గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో రాక్షస, దుష్ట, నియంతృత్వ పాలన సాగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు అన్నారు. గురువారం చీపురుపల్లి వచ్చిన ఆయన స్థానిక విలేకురులతో మాట్లాడారు. రాష్ట్రంలో నియంతృత్వ పోకడలు, బలవంతంగా ఏదనుకుంటే అది చేసేసి ప్రజాస్వామ్యాన్ని మంట గలిపి దుష్ట పాలన సాగించారని విమర్శించారు. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు. ఒక్క నోటిఫికేషన్‌ గానీ, ఒక్క ఉద్యోగం గాని ఇచ్చిన పాపాన పోలేదన్నారు. 20 లక్షల మంది ఇంజనీర్లను తయారు చేశాడే తప్ప ఒక్క ఉద్యోగం కూడా యువతకు ఇవ్వలేదన్నారు. ఒక ఫ్యాక్టరీ గానీ, సర్వీస్‌ సెంటర్స్‌ గానీ రాష్టానికి తీసుకు రాలేదని అన్నారు. అంతే గాకుండా ఇసుక, మైనింగ్‌, మద్యంలో భారీ దోపీడికి పాల్పడ్డారని తెలిపారు. ఇసుక నిల్వలు పక్క రాష్ట్రాలకు అమేసుకోవడం వలన రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి నెలకొందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. భవిష్యత్‌ తరాలకోసం, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం, రాష్ట్ర అబివృద్థిలో గాని ముందుకు సాగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. నాగార్జునను మాతో పాటు నడిపిస్తాం పరిస్థితుల రీత్యా తనను చీపురుపల్లి నుండి పోటీ చేయాలని అదిష్టానం నిర్ణయించిందని కిమిడి కళావెంకటరావు అన్నారు. గత ఐదేళ్లలో చీపురుపల్లి ప్రజలలో ఉంటూ వారి కష్ట సుఖాలలో ఉన్న నాగార్జునను అదిష్టానం పిలిచి భవిష్యత్‌పై మాట్లాడిందని అన్నారు. గతంలో నాగార్జున తల్లిదండ్రులను తమతో ఏవిధంగా అయితే కలసి నడిపించామో అదే విధంగా భవిష్యత్‌లో కూడా మా ఇంటి బిడ్డ అయిన నాగార్జుననను తమతోపాటే తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో చీపురుపల్లి మండల పార్టీ అద్యక్షుడు రౌతు కామునాయుడు, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండల పార్టీ అద్యక్షులు సారిపాక సురేష్‌, తాడ్డి సన్యాసినాయుడు, వెన్ని సన్యాసినాయుడు, పైల బలరాం, దన్నాన రామంద్రుడు, రెడ్డి గోవిందబాబు, జనసేన మండల అధ్యక్షుడు విసినిగిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. చీపురుపల్లినుంచి ప్రచారం ప్రారంభం కళావెంకటరావు తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులతో కలసి చీపురుపల్లిలో ప్రచారం ప్రారంభించారు. ముందుగా కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయంలో తన కుమారుడు మల్లిక్‌నాయుడుతో పాటు నాయకులతో కలసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రౌతుకామునాయుడు, దన్నాన రామంచంద్రుడు, కె త్రిమూర్తులు రాజు, గద్దే బాబూరావు, అందవరపు హరి ఇళ్లకు వెళ్లి ప్రచారం చేసారు. అనంతరం గద్దే బాబూరావు ఇంటి వద్ద యలకల అప్పారావు, గరివిడి మాజీ ఎంపిటిసి రవి, బిజెపి ్ట రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కరణం మురళి టిడిపిలో చేరారు.

➡️