అభివృద్ధే ప్రధాన అజెండా

Jun 15,2024 21:14

ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎం పోస్టులు భర్తీ చేస్తా

గిరిజన సంక్షేమశాఖా మంత్రి సంధ్యారాణి

ప్రజాశక్తి – సాలూరు : రాష్ట్ర అభివృద్ధే ప్రధాన అజెండాగా తమ ప్రభుత్వం పని చేస్తుందని గిరిజన సంక్షేమ, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సైకో పాలన పోయిందని, సైకిల్‌ పాలన మొదలైందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల అమలుపై సిఎం చంద్రబాబు నాయుడు సంతకాలు చేసినట్లు చెప్పారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన విధంగా సుమారు 16వేల పోస్టులతో మెగా డిఎస్సీపైనా, వృద్ధులకు రూ.4వేల పింఛను అమలుపై కూడా సంతకం చేసినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని చెప్పారు. 164 స్థానాల్లో విజయం సాధించడం టిడిపి స్థాపించిన తొలినాళ్లలో కూడా జరగలేదని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉత్తమ పాలన అందిస్తామని చెప్పారు. జులైలో పింఛనుదారులకు మొత్తం రూ.7వేలు అందజేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రతి టిడిపి కార్యకర్త లబ్దిదారులకు దగ్గరుండి అందజేయా లన్నారు. ఏజెన్సీలో గిరిజనులకు డోలీమోతలు లేకుండా చూస్తామన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందజేసేలా చూస్తా నన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఎఎన్‌ఎంల నియామకం చేపడతామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటా మని చెప్పారు. కొటియా గ్రామాల వివాదం కోర్టులో ఉందన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్లనే ఒడిశా అధికారులు, ప్రజాప్రతి నిధులు కొటియా గ్రామాల్లోకి చొరబడి దౌర్జన్యం చేశారని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందు బాటులో వుంటానని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు ఎప్పుడైనా తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చునని చెప్పారు. తనకు ఇష్టమైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కుతుందని ఆశించానని, అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పదవిని ఊహించ లేదని అన్నారు. రాష్ట్రంలోని నిరుపేద మహిళలు, పిల్లలకు పౌష్టికా హారం అందించడానికి కృషి చేస్తానని చెప్పారు సమావేశంలో సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల టిడిపి అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, జి.వేణు గోపాలరావు, పిన్నింటి ప్రసాద్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి ముఖీ సూర్యనారాయణ పాల్గొన్నారు.మంత్రి సంధ్యారాణికి అభినందనలు మంత్రి సంధ్యారాణిని జిల్లా వ్యవసాయశాఖఅధికారి కె.రాబర్ట్‌ పాల్‌, సాలూరు ఎడిఎ మధుసూదనరావు, ఎఒ అనూరాధ పండా, వ్యవసాయ శాఖ సిబ్బంది అభినందనలు తెలిపారు.

➡️