కమ్యూనిస్టులతోనే అభివృద్ధి

May 4,2024 23:07

జొన్నా శివశంకరరావుకు హారతులతో స్వాగతం పలుకుతున్న జనం
ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ :
ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకర్‌, గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌ విజయాన్ని కాంక్షిస్తూ మండలంలోని యర్రబాలెంలో శనివారం రోడ్‌షో చేశారు. అభ్యర్థులకు స్థానికులు పూల మాలలు, హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాజధానికి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి 2014 నుండి బిజెపి అన్యాయం చేస్తూనే ఉందని, రాజధాని ద్రోహి అయిన బిజెపి 2024లో కూడా మొండి చేయి చూపించి ద్రోహం చేస్తారని అన్నారు. బిజెపితోపాటు ఆ పార్టీతో చేతులు కలిపిన టిడిపి, జనసేన, అంట కాగుతున్న వైసిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ ఎన్నికలకు కొత్త నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారని, డబ్బు మూటలతో ఏమారుస్తూ ఉంటారని, వారితో జాగ్రత్తగా ఉండాలని కోరారు. నిమ్మగడ్డ రామ్మోహనరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంత వాణిని అసెంబ్లీలో బలంగా వినిపించారని, కొన్ని వేల మందికి ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇప్పిచ్చామని గుర్తుచేశారు. అభివృద్ధికి కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందుంటారని, మూడు దశాబ్దాల క్రితమే పంచాయతీలో సిపిఎం అధికారంలో ఉండగా ఉండవల్లిలో జరిగిన అభివృద్ధి అందుకు నిదర్శనమని చెప్పారు. కార్పొరేషన్‌ పేరుతో ఇంటి పన్నులు పెంచి, చెత్త పన్ను విధించి పాలకులు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టారని అన్నారు. తనని గెలిపిస్తే పన్నుల భారం తగ్గించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను బిజెపి ప్రవేశపెడితే దాన్ని వైసిపి తూచ తప్పకుండా అమలు చేసిందని, ఆ చట్టాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, కాంగ్రెస్‌ నాయకులు హనుమంతరావు, ఎ.వీరవెంకయ్య, సిహెV్‌ా సత్యనారాయణ, అంటోని, సిపిఐ తిరపతయ్య, జాన్‌బాబు, ఎస్‌.రామరాజు పాల్గొన్నారు.

➡️