అభివృద్ధికి ఆమడ దూరం

Apr 26,2024 21:28

ప్రజాశక్తి – నెల్లిమర్ల : నెల్లిమర్ల పేరుకే నియోజకవర్గ కేంద్రంగా ఉంది తప్ప ఎటువంటి అభివృద్ధికీ నోచుకోలేదు. మండలం మొత్తం జనాభా సుమారు 79వేలు మంది ఉండగా వారికి తగ్గట్టు ఉపాధి అవకాశాలు లేవు. గతంలో నెల్లిమర్ల జ్యూట్‌ పరిశ్రమలో సుమారు 6వేల మందికి పైగా ఉపాధి పొందేవారు. 1990 వరకు జిల్లాతో బాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉపాధి కోసం నెల్లిమర్ల జ్యూట్‌ మిల్లుకు వచ్చే సందర్భాలు ఉన్నాయి. కాలక్రమేణా జ్యూట్‌ పరిశ్రమ మారిన టెక్నాలజీతో కనుమరుగై కేవలం 1500 మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. ఈ ప్రాంతంలో ఒక పక్క కొండలు, గుట్టలు, చంపావతి నది, రైల్వే లైన్‌ ఉండటంతో మండల కేంద్రంలో కేవలం 3500ఎకరాల భూములు మాత్రమే ఉన్నాయి. ఆ భూమిలో కూడా వర్షా బావ పరిస్థితులు ఏర్పడి కొంత మంది రైతుల భూములు అమ్ముకోవడంతో రియల్‌ ఎస్టేట్‌లుగా మారాయి.మూలకు చేరిన కుమిలి సాగునీటి ప్రాజెక్టుచంపావతి నది నుంచి నీటిని మళ్లించి మండలంతో పాటు పూసపాటిరేగ మండలానికి కూడా సాగునీటిని అందించాలని ప్రారంభించిన కుమిలి సాగునీటి ప్రాజెక్టు మూలకు చేరింది. కాలువ పూర్తిగా పూడికపోవడంతో కాలువ ద్వారా సాగునీరు రైతులకు అందడం లేదు. దీంతో వర్షాలు కోసం వేచి చూడటం తప్ప రైతులు సాగునీటిపై ఆధారపడటం మానేశారు. మండల కేంద్రంలో తాగునీటి కష్టాలు కూడా పడుతున్నట్లు స్ధానికులు చెబుతున్నారు.ఉపాధి కోసం వలసఈ ప్రాంతంలో ప్రజలు ఉపాధి కోసం జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ పనులు, షాపులకు, వందలాది మంది మహిళలలు విశాఖ జిల్లా ఆనందపురం రొయ్యల పరిశ్రమలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కాగా పాలక పార్టీలు నియోజకవర్గ కేంద్రంగా గుర్తించారు గాని ఈ ప్రాంత వాసులకు ఉపాధి మార్గాలు కల్పించలేక పోయారు. గతంలో టిడిపి, కాంగ్రెస్‌, ప్రస్తుత వైసిపి కూడా ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశం పై పట్టించుకోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుత నెల్లిమర్ల నియోజక వర్గం గతంలో సతివాడ నియోజక వర్గంగా ఉండేది ఆ కాలంలో దివంగత మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు ఎమ్మెల్యేగా, మంత్రిగా స్థానికంగా నివాసం ఉండి నెల్లిమర్లతో బాటు నియోజకవర్గ పరిధిలోని మండలాల బాగోగులు చూసుకొనే వారు. నెల్లిమర్ల నియోజక వర్గంగా మారిన తరువాత టిడిపి, వైసిపి ఏదో మొక్కు బడిగా వచ్చి వెళ్తున్నారు గాని నియోజక వర్గ కేంద్రాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలక పార్టీలు నియోజక వర్గ కేంద్రాన్ని పట్టించుకుని అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.పవన్‌ హామీతో ఆశలునెల్లిమర్ల జ్యూట్‌మిల్లుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల డెంకాడ మండలం సింగవరం వద్ద జరిగిన సభలో ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు గతంలో 10వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించేదని కాల క్రమేణ ఆ సంఖ్య తగ్గిందని కూటమి అధికారంలోకి రాగానే తాను జ్యూట్‌మిల్లుపై దృష్టి పెట్టి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. పవన్‌ మాటలతో స్థానిక కార్మికులకు, యువతకు మళ్లీ జ్యూట్‌ మిల్లుపై ఆశలు చిగురించాయి.

➡️