ప్రశాంత వాతావరణంకు సహకరించాలి : జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

May 22,2024 15:45 #AP police, #Kakinada

ప్రజాశక్తి- కాకినాడ : కాకినాడ నగరంతో పాటు జిల్లాలో ప్రశాంత వాతావరణంకు సహకరించాలని ఒకవేళ కేసులు నమోదవుతే వారికి మరిన్ని కష్టాలు ప్రారంభమవుతాయని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. కాకినాడ నగరంతో పాటు జిల్లాలో 144 సెక్షన్ నిబంధన అమలులో ఉందని అందువల్ల ప్రజలు గుంపులుగా గుమ్మిగూడ వద్దని కోరారు. బుధవారం కాకినాడ సూర్య కళామందిరంలో వివిధ రాజకీయ పక్షాలు, కాకినాడ నగర ప్రజలకు ఎన్నికల నియమావళిపై వివరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు అనంతరం కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని అంతవరకు ఎవరూ కూడా ఎటువంటి దాడులు, కవ్వింపు చర్యలు, దౌర్జన్యాలకు పాల్పడవద్దని అలాగే సంబరాలు చేసుకొని ఇతరులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. కేసు కనుక తాము నమోదు చేస్తే వారికి మరిన్ని కష్టాలు మొదలవుతాయని ఆ తర్వాత తమ చేతుల్లో ఏమీ ఉండదంటూ చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కేసులు నమోదవుతే వాటిని చాలా సీరియస్గా పరిగణిస్తుందని అందువల్ల ఎన్నికల కోసం స్నేహితులను ఇతర పరిచయస్తులను దూరం చేసుకోవద్దన్నారు. ఎవరు గెలిచినా కాకినాడ ప్రజలు ఇచ్చిన తీర్పుగానే కట్టుబడి ఉండి ఆనందం వ్యక్తం చేయాలని సూచించారు. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో మంచి స్నేహితులు మాదిరిగా కలిసి ఉండాలని ఎస్పి హితవు పలికారు. హద్దు మీరితే కేసులు నమోదు చేస్తామని వాటి వల్ల ముందు కాలంలో సమస్య తీవ్రంగా ఉంటుందని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు.  అవగాహన కార్యక్రమంలో కాకినాడ డిఎస్పి కె హనుమంతరావు వివిధ పోలీస్ స్టేషనులకు చెందిన సిఐలు, ఎస్సైలు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️