పది రోజులు విశ్రమించొద్దు

May 3,2024 21:19

శృంగవరపుకోట: పోలింగ్‌ బూత్‌ స్థాయిలో అందరూ ఏకమై, ఈ పది రోజులు విశ్రమించకుండా పనిచేయాలని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం పట్టణంలోని సిరికి రిసార్ట్స్‌లో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన బూత్‌ స్థాయి కార్యకర్తలు, కన్వీనర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. శృంగవరపుకోటలో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మొత్తం క్లీన్‌ స్వీప్‌ చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. వాలంటీర్లు అందరూ రిజైన్‌ చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. మళ్లీ ఎన్నికలయ్యాక వాలంటీర్లు అందరినీ యథాతథంగా నియమిస్తామని హామీనిచ్చారు. బూత్‌ స్థాయి కార్యకర్తలు, కన్వీనర్లే ఎన్నికల సమరంలో కీలకమని చెప్పారు. ప్రతి ఓటు మనకు కీలకం, పథకాల లబ్ది పొందిన ప్రతిఒక్కరూ మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, వాలంటీర్లు.. అందరూ సమన్వయంతో ఓటరు జాబితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎన్నికల కోసం సిద్ధం కావాలని సూచించారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని తప్పక నెరవేరుస్తామని చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి డాక్టర్‌ మధు, నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజరు కుమార్‌, కొప్పలవెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడుబాబు, జిసిసి చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, డిసిసిబి చైర్మన్‌ వేచలపు చినరామునాయుడు, ఎఎంసి చైర్‌పర్సన్‌ మూకల కస్తూరి, ఎంపిపిలు గేదెల శ్రీనివాసరావు, నీలంశెట్టి గోపమ్మ, దొగ్గ సత్యవంతుడు, జెడ్‌పిటిసిలు తూర్పాటి వరలక్ష్మి, గొర్లె సరయు, నెక్కల శ్రీదేవి, సేనాపతి అప్పారావు, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, గుమ్మడి సత్యనారాయణ, మమ్ములూరి జగన్నాథం, మోపాడ కుమార్‌, గొర్లె రవికుమార్‌, పంచాయతీరాజ్‌ జోనల్‌ చైర్మన్‌ ఎం.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️