పోస్టల్‌ బ్యాలెట్‌పై ఆందోళన వద్దు

May 6,2024 00:49

వివరాలు వెల్లడిస్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌
ప్రజాశక్తి-గుంటూరు :
పోస్టల్‌ బ్యాలెట్‌పై ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల కమిషనర్‌ మార్గదర్శకాల ప్రకారం అందరూ ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో అక్కడే పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే విధంగా వారి డ్యూటీ ఆర్డర్‌లో స్పష్టంగా ఉందని చెప్పారు. ఆదివారం కలెక్టరేట్‌లోని ఎలక్షన్‌ మీడియా సెల్‌లో నిర్విహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ తుషార్‌దూదితో కలిసి మాట్లాడారు. జిల్లాలో తుది జాబితా ప్రకారం 17,91,543 మంది ఓటర్లు ఉన్నారని, ఆ జాబితాను గుర్తింపు పొందిన పార్టీలకు అందచేశామన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఓటరు స్లిప్పులను కూడా సిబ్బంది ప్రతి ఓటరుకూ అందించటానికి చర్యలు తీసుకున్నామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. 5, 6 తేదీల్లో పిఒలు, ఎపిఓలు, మైక్రో అబ్జర్లకు శిక్షణ ఉన్నందున, శిక్షణ ముగిసిన తర్వాత 4 గంటల నుండి అక్కడే ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఓటు వేయొచ్చన్నారు. ఓపిఒలు, ఇతర సిబ్బందికి 7, 8 తేదీల్లో ఉదయం 8 గంటల నుండే బ్యాలెట్‌ ఓటింగ్‌ ఉంటుందన్నారు.గుంటూరు జిల్లాలో ఓటు కలిగి, ఇక్కడే ఓటు వినియోగించుకునే వారితోపాటు, ఇక్కడ ఓటు ఉండి, వేరే జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న వారు, ఇతర జిల్లాల్లో ఓటు కలిగి, ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఫారం-12 ప్రకారం వారు ఏఏ జిల్లాలకు చెందిన వారో గుర్తించి, అక్కడి అధికారులతో సమన్వయం చేసుకొని, వారి ఓటున్న నియోజకవర్గ బ్యాలెట్‌ను కూడా తెప్పించామన్నారు. ఆ విధంగా ఇతర జిల్లాల నుండి 5092 బ్యాలెట్లు తెప్పించామన్నారు.అలాగే మన జిల్లాకు చెందిన బ్యాలెట్‌ పేపర్లు 5868 ఇతర జిల్లాలకు పంపినట్లు చెప్పారు. ఇంకా ఫారం-12 సమర్పించిన వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ ఈనెల 7, 8 తేదీల్లో ఫారం అందించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని వివరించారు. అలాగే 85 ఏళ్లు దాటిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు హౌం ఓటింగ్‌కు సంబంధించి 17,357 మంది ఉంటే 2348 మంది ఎంచుకున్నారని, వారిలో మే 3, 4 తేదీల్లో 1922 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. జిల్లాలో 372 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించామని, వాటిలో వెబ్‌క్యాస్టింగ్‌తోపాటు, మైక్రో అబ్జర్వర్‌ను కూడా నియమించటం జరుగుతుందన్నారు.ఎస్సీ తుషార్‌ దూది పోలీసు శాఖ చేపట్టిన ఎన్నికల సన్నద్ధతను వివరించారు.

➡️