దొందూ దొందే!

May 5,2024 21:00

ప్రజాశక్తి- పాలకొండ : 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన విశ్వాసరాయి కళావతి వల్ల పాలకొండకు ఒనగురిందేమి లేదని చెప్పవచ్చు. ఒకసారి విపక్ష ఎమ్మెల్యేగా, మరోదఫా అధికారపక్షం లో ఎమ్మెల్యేగా వ్యవహరించిన కళావతి వల్ల పాలకొండ ఎటువంటి అభివృద్ధికీ నోచుకోలేదు. సిఎం జగన్మోహన్‌ రెడ్డికి అత్యంత ఆప్తురాలుగా చెప్పుకుంటున్న కళావతి వల్ల ఈ పది సంవత్సరాల కాలంలో ఒక్క చిన్న పరిశ్రమ అయినా వచ్చిందా అంటే ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. కనీసం నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఈమె వెనకబడి ఉన్నారనే చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాలు కలగా ఉన్న జంపరకోట జలాశయం, తోటపల్లి ఎడమ కాలువ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. ఈ దశాబ్ద కాలంగా పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ, రైతుబజారు ఏర్పాటు, శాశ్వత డంపింగ్‌ యార్డ్‌ ఏర్పాటు, వెంకటరాయుని కోనేరు పార్కుగా తీర్చిదిద్దటం, ఇంటింటికి కుళాయి నీరు, సుపర్‌ స్పెషలిటీ హాస్పిటల్‌, విద్యార్థుల కోసం పీజీ సెంటర్‌ ఏర్పాటు పనులు కనీసం ముందుకు కదల్లేదు. ఇవన్నీ ప్రతీ ఎన్నికల్లో హామీలుగా ప్రస్తావించటానికి తప్ప కార్యరూపం దాల్చే ప్రక్రియ మాత్రం జరగడం లేదు. పైపెచ్చు ఈమె తన నోటి దురుసుతో ప్రజల్లో చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్సీ విక్రాంత్‌తో ఈమెకు పొసగదని, వీరిద్దరూ బయటకు ఒకరిపై ఒకరు చూపించే ఆప్యాయత, పలకరింపులు అన్నీ ఉట్టివే అని ప్రజల్లో చర్చ నడుస్తుంది.2014లో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన నిమ్మక జయకృష్ణ ఓటమి చెందినప్పటికీ 2014 నుండి 2019 మధ్య అప్పటీ టిడిపి ప్రభుత్వంలో పాలకొండ నియోజికవర్గ భాద్యుడుగా వ్యవహరించారు. కానీ ప్రభుత్వం నుండి పాలకొండ అభివృద్ధి కోసం ఏమైనా చేశారా అంటే లేదనే చెప్పాలి. టిడిపి హయాంలో కేవలం నియోజకవర్గ భాద్యులుగా వ్యవహరించటం తప్ప ఆయన ఏమి చేయలేదని అపవాదును ఆయన మూటకట్టుకున్నారు. 2008లో శ్రీకాకుళం జిల్లా హాస్పిటల్‌ను మెడికల్‌ కాలేజ్‌గా మార్చి 2013లో రిమ్స్‌గా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొని వచ్చారు. దీంతో అప్పట్లో పాలకొండ హాస్పిటల్‌ను జిల్లా హాస్పిటల్‌గా మారుస్తూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ 2014 లో ఏర్పడిన టిడిపి ప్రభుత్వంలో పాలకొండ గవర్నమెంట్‌ హాస్పిటల్‌ను ఏరియా హాస్పిటల్‌గా గుర్తించి, జిల్లా హాస్పిటల్‌ను టెక్కలికి తరలించారు. అప్పుడు పాలకొండ ఎమ్మెల్యేగా ఉన్న కళావతి కానీ, నియోజకవర్గ భాద్యులుగా ఉన్న జయకృష్ణ కానీ ఈ ప్రక్రియను కనీసం ఆపే ప్రయత్నం చేయలేదని ప్రజల్లో తీవ్ర అసహనం ఉంది. 2014లో మొదటిసారి ఓడిపోయాక కనీసం తమ ప్రభుత్వ హయాంలో అయినా ఈయన పాలకొండ కోసం ఏమైనా చేసినా ఈయన మీద ప్రజల్లో నమ్మకం వచ్చి 2019లో ఈయన గెలిచే అవకాశం ఉండదేమో కానీ ఆ దిశగా ఆయన ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేయకపోవడం వల్ల ప్రజల్లో ఈయన నమ్మకం కోల్పోయారు అని చెప్పుకోవచ్చు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న పాలకొండ సమస్యలే ప్రతీ ఎన్నికల్లో కూడా హామీలుగా మారటం తీవ్ర జుగుప్సాకరమైన విషయంగా చెప్పవచ్చు. దశాబ్ద కాలంగా ఒక్క హామీ కూడా నెరవేరకపోవటం విడ్డురమనే చెప్పవచ్చు. ఒకవేళ ఏదైనా హామీ పొరపాటున నెరవేరిస్తే మళ్ళీ ఎన్నికల్లో ఇవ్వటానికి కొత్త హామీ వెతుక్కోవాలి, దాని బదులు ఇదే హామీ దశాబ్దాల పాటు ఇవ్వటం ఉత్తమం అని ఆయా పార్టీలు భావిస్తున్నాయేమో అనే ఛలోక్తులు కూడా ప్రజల్లో వినిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో టిడిపి, వైసిపి తరపున ప్రత్యర్థులుగా ఉన్న జయకృష్ణ, కళావతినే ఈసారి ముచ్చటగా మూడోసారి ప్రధాన ప్రత్యర్థులుగా ఉండటం కొసమెరుపు. అయితే పొత్తుల్లో భాగంగా ఎన్‌డిఎ కూటమి తరపున జనసేనకు టిక్కెట్టు కేటాయించడంతో జయకృష్ణ టిడిపి నుంచి జనసేనలోకి వెళ్లి టిక్కెట్టు దక్కించుకున్నారు. దీంతో వైసిపి నుంచి కళావతి, జనసేన నుంచి జయకృష్ణ ముచ్చటిగా మూడోసారి పోటీ పడుతున్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చని కళావతికి ప్రజలు పట్టం కడతారా? లేదా కొత్త పార్టీతో బరిలోకి దిగిన జయకృష్ణకు సానుబూతితో పట్టం కడతారా అని చర్చ జరుగుతోంది.

➡️