రౌడీషీట్‌ తెరుస్తాం: డిఎస్‌పి

ప్రజాశక్తి-మార్కాపురం: ఓట్ల లెక్కింపు తరువాత కూడా గొడవ పడితే అలాంటి వ్యక్తులను గుర్తించి వారిపై రౌడీ షీట్‌ తెరుస్తామని మార్కాపురం డిఎస్‌పి ఎం బాల సుందరరావు హెచ్చరిం చారు. మార్కాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఓట్ల లెక్కింపు తరు వాత కూడా ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించ కుండా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు సహకరించా లని ఆయన కోరారు. మంగళవారం స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘర్షణలకు తావులేకుండా ఉండేందు కు ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పల్లెనిద్ర పేరుతో రోజూ ఏదో ఒక పల్లెలో పోలీస్‌ అధికారులు బస చేస్తారన్నారు. ఆ సమయంలో పోలీసులు ప్రజలతో మాట్లాడతారన్నారు. గొడవలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరిస్తామన్నారు. ఎన్నికల గొడవలకు కారకులపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని చెప్పారు. గొడవలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఒకరు గెలవడం.. మిగిలినవారు ఓడిపోవడం సహజమేనన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని కొందరు గొడవలకు పాల్పడితే ఇబ్బందులు తప్పవన్నారు. ఎక్కడ ఏమి జరిగినా పోలీసులకు తక్షణమే సమాచారం అందించాలన్నారు. పోలీస్‌ శాఖ తక్షణం స్పందిస్తుందని అన్నారు. విజయోత్సవంలో డిజెలు, బాణాసంచా కాల్చడం వంటి చర్యలు సరికాదన్నారు. ఈ పాటికే బాణాసంచా అమ్మకందారులకు భారీ కొనుగోళ్లు జరగకుండా నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. పెట్రోల్‌ బంకుల్లోనూ వాహనం వస్తే తప్ప… లూజుగా పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు చేపట్టరాదన్నారు. లూజు అమ్మకాలు చేపట్టిన పెట్రోల్‌ బంకుల నిర్వాహకులపై చర్యలు ఉంటాయన్నారు. ఈ పాటికే పట్టణాల్లో, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలనే లక్ష్యంతో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టామన్నారు. మారణాయుధాలు, బాంబులు వంటివి ఉంటే సీజ్‌ చేస్తామని, సంబంధిత వ్యక్తులను వదిలేది లేదని హెచ్చరించారు. అందరూ కలిసిమెలిసి జీవించాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో సిఐ ఆవుల వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్‌ఐ షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️