ద్వారంపూడి మూడు తరాలది అక్రమ వ్యాపారమే : టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి

Dec 5,2023 15:13 #Kakinada

ప్రజాశక్తి కాకినాడ : కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన మూడు కుటుంబాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆ మూడు తరాలది అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశారని వారి నుండి కాకినాడ ప్రజలను రక్షించడమే ధ్యేయంగా నగరంలో ఉన్న టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) పేర్కొన్నారు. ద్వారంపూడి మొదటి, రెండు, మూడో తరం వాళ్లు నల్లమందు, దొంగ నోట్లు, గంజాయి, నోట్ల మార్పిడి అక్రమ బియ్యం వంటి వ్యాపారాలు చేశారే తప్పా ఏనాడు ప్రజాహిత కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవని వనమాడి అన్నారు. ఇతరుల కుటుంబాలను విమర్శించే ముందు వారి చీకటి వ్యాపార చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. మంగళవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో వనమాడి విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. తమ పార్టీ యువ నేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు భారీ ఎత్తున ప్రజలను స్పందన, ప్రభుత్వ వైఫల్యాలపై వినతులను ఇచ్చేందుకు ఆయా వర్గాలకు చెందిన ప్రజలు పోటెత్తారన్నారు. ఈ ఈ స్పందన చూసి ద్వారంపూడి లోకేష్ యువగళంపై అనవసర వ్యాఖ్యలు చేశారన్నారు.
ఇంకా కొండబాబు మాట్లాడుతూ లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన యువగళం పాదయాత్రకు కాకినాడలో అశేష స్పందనతో పాటు బహిరంగ సభకు భారీ ఎత్తున కాకినాడ ప్రజలు హాజరై విజయవంతం చేశారన్నారు. దీంతో వైకాపా వారికి నిద్ర కరువడంతో లోకేష్పై అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. కాకినాడ ప్రజలను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి అక్రమాలపై నుండి రక్షించడమే టీడీపీ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. నగరంలో ద్వారంపూడి నేతృత్వంలో భూకబ్జాలు, అరాచకాలు ఇతర అక్రమాలు బాగా పెరిగాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విధానాల వల్ల యువత ఉపాధి కోల్పోయి గంజాయి ఇతర మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల వారి జీవితం నాశనం అవుతుందని కొండబాబు ఆందోళన వ్యక్తం చేశారు. లోకేష్ యువగళం ప్రవేశించిన రోజు నుంచి సుమారు వారం రోజులపాటు ద్వారంపూడి ఎక్కడికి వెళ్లారో ఏమైపోయారో బహిర్గతం చేయాలని లేని పక్షంలో తానే చెబుతానని కొండబాబు అన్నారు. 2019లో ద్వారంపూడి ఎన్నో అక్రమాలు చేశారని తమ టీడీపీలో ఉన్న కోవర్ట్లు సహాయం వల్ల అతను తప్పించుకున్నారని ఈసారి అతన్ని వదిలేది లేదంటూ కొండబాబు హెచ్చరించారు. ద్వారంపూడి అక్రమాలపై తాను సిటీ పరిధిలో రెడ్ బుక్లో పేరు నమోదు చేస్తున్నానని ఈ సారి అతను తప్పించుకునేది లేదన్నారు. తమ యువ నేత లోకేష్ను నాలిక చీరేస్తానని అన్నారని 2024 ఎన్నికల్లో ద్వారంపూడిని కాకినాడ ప్రజలు చీరేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో ద్వారంపూడి తమ పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్లపై అసెంబ్లీలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని ఇది విన్న రాష్ట్ర ప్రజలు అతనిని తోపాటు అతని కుటుంబ సభ్యులను కూడా తిట్టిన సంగతిని గుర్తించాలన్నారు. ద్వారంపూడి ఇతరులపై చేసిన వ్యాఖ్యలు వారి తల్లిదండ్రులకు సిగ్గుగా కనిపించట్లేదా లేక వారే అతనిని ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు. ద్వారంపూడి మాదిరిగా తాము వ్యక్తిగతంగా కూడా విమర్శించగలమని కానీ సంస్కారం అనేది అడ్డు వస్తుందని కొండబాబు చెప్పారు. ద్వారంపూడి తన విధానాలు మార్చుకోవాలని లేనిపక్షంలో బుద్ధి చెబుతామంటూ వనమాడి హెచ్చరించారు.
ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, పలివెల రవి, తుమ్మల రమేష్, బంగారు సత్యనారాయణ, గుజ్జు లక్ష్మణరావు, శేఖర్ ఎస్ఎ తాజుద్దీన్, ఒమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

➡️