అడ్మిషన్లు చేస్తేనే జీతం ..ప్రైవేటు యజమాన్యాల వైఖరి : డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ

Apr 11,2024 16:01 #palnadu

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :ప్రస్తుతం అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు కాలం సమీపిస్తున్న నేపథ్యంలో కార్పోరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన ఉపాధ్యాయులను అడ్మిషన్ల పేరిట బయట తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శిలు ఆంజనేయరాజు, కోట సాయికుమార్‌ లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కేంద్రం కోటప్పకొండ రోడ్డులోని ప్రజా సంఘాల కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే దాదాపుగా విద్యా సంవత్సరం ముగింపుకు వచ్చిందని ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఎండాకాలం రెండు నెలలు కూడా అడ్మిషన్ల పేర ఇంటింటికి యాజమాన్యాలు తిప్పుతున్నాయన్నారు. అడ్మిషన్లు చేస్తేనే ఈ రెండు నెలలు జీతం వస్తుందని యాజమాన్యం ఉపాధ్యాయులకు చెప్పడంతో గత్యంతరం లేక ఉపాధ్యాయులు ఎండలు మండుతున్నప్పటికీ ఇంటింటికి తిరిగి తమ పాఠశాలలో విద్యార్థులను చేర్చాలని తల్లిదండ్రులను బతిమిలాడుతున్నారు. వేసవి సెలవుల్లో పాఠశాల లేకపోయినా ఉపాధ్యాయులకు 12 నెలల జీతం అందించాల్సిన విద్యాసంస్థలు అడ్మిషన్ల పేర ఉపాధ్యాయులను వీధుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనలు ఇలా బాహాటంగా ఉల్లంఘిస్తున్న పాఠశాలల లైసెన్సులు రద్దు చేయాలని డివైఎఫ్‌ఐ మరియు ఎస్‌ఎఫ్‌ఐ తరపున డిమాండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా విద్యాశాఖ అధికారులపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవు కాబట్టి ఈ ఏడాదైనా విద్యాశాఖ అధికారులు యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ప్రైవేటు ఉపాధ్యాయుల హక్కులు కాపాడాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేటు ఉపాధ్యాయులపై అడ్మిషన్ల వేధింపులు ఆపకపోతే ప్రయివేటు ఉపాధ్యాయులందరిని ఏకం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

➡️