అక్రమంగా ఇసుక తవ్వకాలు

Jan 24,2024 22:19
అక్రమంగా ఇసుక తవ్వకాలు

ప్రజాశక్తి – సీతానగరం సీతానగరం మండలంలో మునికూడలి ఇసుక ర్యాంపులో అక్రమంగా లంక భూముల్లో సైతం భారీగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. గత నెలలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఇసుక లారీలను సైతం అడ్డుకున్నారు. లంక భూముల్లో పట్టాలు కలిగిన రైతుల భూముల నుంచి సైతం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధికి తెలియజేసినా తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఈ భూముల్లో బోరులు వేసి వ్యవసాయం చేసుకున్నామని ఆ బోరులను సైతం తొలగించి పట్టా భూముల్లో అక్రమంగా ఇసుక సాగిస్తున్నారని రైతులు తెలిపారు. గతంలో ఇసుక తవ్వకాలు చేస్తే రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించేవారని, నేడు ఎటువంటి నష్టపరిహారం రైతులకు చెల్లించకుండానే దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తున్నారని చెప్పారు. ఇదేమిటని అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని రైతులు వాపోతున్నారు. గతంలో ఈ లంక భూముల్లో పుచ్చపాదులు, నాటు పొగాకు, దోస పాదులు, గుమ్మడి పాదులు వేసి జీవనం సాగించే వారిమని, ఇప్పుడు దౌర్జన్యంగా ఇసుక మాఫియా ఇష్టానుసారంగా అనుమతులు మించి లోతుగా ఇసుక తవ్వకాలు జరిపి తమను నడివీధిన నిలబెడుతున్నాని వాపోతున్నారు. ఇది మీ భూమి కాదంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని అధికారులకు తెలియజేసినా పట్టించుకున్న నాధుడే లేడని స్థానిక రైతులు అంటున్నారు. గతంలో ఈ లంక పొలాలకు చెందిన రైతులకు 95 ఎకరాలకు గాను రూ.రెండు లక్షలు రైతులకు ఇస్తామని చెప్పి చివరకు అది కూడా ఇవ్వకుండా ఇసుకను అక్రమంగా తరలించుకు పోయారన్నారు. ఈ అన్యాయంపై ప్రశ్నించిన రైతులను కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించారంటున్నారు. ప్రక్కిలంక విఆర్‌ఒ వచ్చి తూతూ మంత్రంగా కొలతలు చేపట్టి మాకు ఎటువంటి కాగితం రూపంలో వివరణ ఇవ్వకుండానే వెళ్లిపోయారన్నారు. రహదారిపై అధిక బరువుతో ఇసుకను రవాణా చేయడం వల్ల రోడ్డు ఎప్పటికప్పుడు ధ్వంసమై ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇసుకకు ఎక్కడలేని డిమాండ్‌ ఏర్పడడంతో ర్యాంపుల్లో తవ్వకాలు జోరందుకున్నాయి. ఎపిఎండిసి, జెపి సంస్థలు ఇసుక అమ్మకాల బాధ్యతను ప్రతిమా సంస్థకు అప్పగించింది. మునికూడలి ఇసుక రాంపులో స్థానిక అధికార పార్టీ నాయకుడు చక్రం తిప్పడంతో ప్రతిమా సంస్థ ఆధ్వర్యంలో నదీ గర్భంలోనే పదుల సంఖ్యలో మిషన్లతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. కొన్ని ఇసుక ర్యాంపులకు గతేడాది నవంబరులోనే గడువు తీరిపోగా మరికొన్నింటికి ఈ మార్చితో కాలపరిమితి ముగిసింది. అయినప్పటికీ ర్యాంపుల నిర్వాహకులు అనధికారికంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. అందిన కాడికి ఇసుకను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యావరణ అనుమతులు పాటించకపోయినా అధికారులు మాత్రం చూసిచూడన్నట్టు వ్యవహరిస్తున్నారంటున్నారు. రాత్రనకా పగలనకా భారీ లారీలతో ఇసుకను తరలిస్తున్నారు. దీంతో ఏటిగట్టు, కాతేరు నుంచి సీతానగరం వరకు రహదారికి తూట్లు పడుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన జిల్లా స్థాయి సాండ్‌ కమిటీ సమావేశాలు కూడా సక్రమంగా జరగడం లేదని ప్రజలు అంటున్నారు. సీతానగరం మండలంలో మునికూడలి మీదుగా ఉభయ గోదావరి జిల్లాల్లో వందలాది ఇసుక ర్యాంపులున్నా నూటికి 95 శాతం ర్యాంపులు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో లారీకి 47 టన్నుల ఇసుకను లోడ్‌ చేస్తున్నారు. మైనింగ్‌, ఇరిగేషన్‌, రెవెన్యు అధికారులెవరూ కూడా వాటివైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు అంటున్నారు. ఏటిపట్టి వాసుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఏటిగట్టును ఇసుక తరలింపు కోసం ఎక్కడపడితే అక్కడ తూట్లు చేస్తున్నారు. ఆగస్టు నెలలో ఉధతంగా ప్రవహించే గోదావరితో మండల వాసులు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ అప్పటికప్పుడు స్థానిక నాయకులు వచ్చి తూతూ మంత్రంగా ఇసుక బస్తాలు వేయించి వెళ్ళిపోతున్నారని చెప్పారు. వాస్తవానికి నది గట్ల మీద కేవలం 10 టన్నుల బరువున్న వాహనాలు వెళ్ళేందుకు మాత్రమే అనుమతి వుంటుంది. కానీ 47 టన్నుల బరువు గల వాహనాలు కూడా ఏటిగట్ల మీద రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికితోడు కొన్ని ర్యాంపులు నివాసిత ప్రాంతాలకు సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడక తప్పడం లేదని ప్రజలు అంటున్నారు. ర్యాంపుల నుంచి ప్రభుత్వ యంత్రాంగానికి భారీగా ముడుపులు అందడం వల్లే వారు నోరు మెదపడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

➡️