ఎన్నికల ప్రక్రియపై సిఇసి సమీక్ష

Mar 27,2024 22:42
ఎన్నికల ప్రక్రియపై సిఇసి సమీక్ష

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులతో బుధవారం వెలగపూడి నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులతో కలిసి కలెక్టర్‌ మాధవీలత పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, నామినేషన్లు ఏప్రిల్‌ 18 నుంచి ఏడు రోజుల పాటు స్వీకరించి, తదుపరి ఎన్నికల ప్రక్రియకు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ మేరకు నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించాల్సిన పనులను, శిక్షణా కార్యక్రమాలను పూర్తి చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఫారం-7 ఫారం 8ల పరిష్కారం, నామినేషన్‌ ప్రక్రియ ముగిసే రోజులవరకు ఫారం 6 స్వీకరణ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ముందుగా ప్రిసైడింగ్‌ అధికారి (పిఒ), ఎపిఒ, ఇతర పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహణ కోసం అనువైన ప్రాంతాన్ని గుర్తించి, అక్కడ తాగునీరు, విద్యుత్‌, తరగతి గదుల్లో ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయోలేదో వ్యక్తిగతంగా తనిఖీ చెయ్యాలని, నివేదిక అందజేయాలని ఆదేశించారు. తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌ గుర్తింపు, ఇవిఎంల కమిషనింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, అక్కడ విధులను నిర్వర్తించడం కోసం అధికారులు, సిబ్బందికి చెందిన రూట్‌ ప్రోగ్రాం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా ఎన్నికల విధులు బాధ్యతలు సంభందించి నిర్దేశిత ఫారం పూర్తి చెయ్యడంపై పిపిటి పంపనున్నట్లు తెలిపారు. ప్రతీ శిక్షణ కార్యక్రమంలో ఆర్‌ఒ మాస్టర్‌ ట్రైనర్‌ శిక్షణ కార్యక్రమం పరిశీలించి, ఎన్నికల సిబ్బందిని ముఖ్యమైన సూచనలు తెలియజేయాలన్నారు. ఆబ్సెంట్‌ ఓటర్లను గుర్తించడం, రికార్డుల పరిశీలన బిఎల్‌ఒల వారీగా ఒక క్రమ పద్ధతిలో నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆ మేరకు ఫారం 12 డి అందజేయాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలకు అనుమతుల జారీని వేగవంతం చేయడంలో భాగంగా తాత్కాలిక పార్టీ ఆఫీసులు కోసం అనుమతులు కోరే క్రమంలో పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో లేకుండా ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తరువాతే అనుమతించాల్సి ఉంటుందనీ కలెక్టర్‌ చెప్పారు. సి-విజిల్‌ ద్వారా అందే ఫిర్యాదును సకాలంలో పరిష్కరించడం, ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్మెంట్‌ ను పటిష్టంగా అమలు పరచడంపై వివిధ తనిఖీ బృందాల విధుల్లో జవాబుదారీతనం, ఖచ్చితత్వం కలిగి ఉండడం చాలా ముఖ్యం అన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు సిబ్బందికి ఇతర అనుబంధ ఎన్నికల విధుల్లో బాధ్యతలు చేపట్టే వారికీ పోస్టల్‌ బ్యాలెట్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్‌ ఆర్‌ఒ, జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, అర్బన్‌ ఆర్‌ఒ, మునిసిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, కొవ్వూరు ఆర్‌ఒ, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ్‌, రాజానగరం ఆర్‌ఒ ఆర్‌డిఒ ఎ.చైత్ర వర్షిణి, గోపాలపురం ఆర్‌ఒ, ఒఎన్‌జిసి ఎస్‌డిసి కెఎల్‌.శివజ్యోతి, నిడదవోలు ఆర్‌ఒ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆర్‌వి.రమణా నాయక్‌, అనపర్తి ఆర్‌ఒ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.మాధురి పాల్గొన్నారు.

➡️