ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల

Jun 19,2024 21:33
ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభకు టిడిపి సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ గోరంట్లకు ఫోన్‌ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని కోరారు. దీనికి గోరంట్ల సమ్మతించారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగారు. ఇప్పటి వరకూ పదిసార్లు ఎంఎల్‌ఎగా పోటీ చేసి ఏడు పర్యాయాలు విజయం సాధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఏడు సార్లు ఎంఎల్‌ఎగా గెలుపొందింది గోరంట్ల మాత్రమే. ఈ నెల 21 నుంచి రాష్ట్ర శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్‌లతో పాటూ నూతన మంత్రులు, ఎంఎల్‌ఎలతో గోరంట్ల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎంపిక జరుగుతుంది. స్పీకర్‌గా ఇప్పటికే అయ్యన్నపాత్రుడుపేరు ఖరారైన విషయం విదితమే.

➡️