పంచాయతీలపైనే భారాలు..

Feb 17,2024 22:28
పంచాయతీలపైనే భారాలు..

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలోని గ్రామ పంచాయతీలు సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయి. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పంచాయతీల హక్కులు ఒకొక్కటిగా ఆవిరౌతున్న విషయం విదితమే. మేజర్‌ పంచాయతీలకు కొంత మేర ఆదాయం ఉండటంతో కొంత ఊరట లభిస్తోంది. మైనర్‌ పంచాయతీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలో 300 పంచాయతీలున్నాయి. ఏటా విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులను కూడా అత్యవసర సమయంలో వాడుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీనిపై పాలకవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత కొన్నేళ్లు పంచాయతీల్లో కరెంటు బిల్లులు రూ.కోట్లలో బకాయిలు ఉన్న విషయం విదితమే. ఆర్థిక సంఘం నిధులు విడుదలైన ప్రతిసారీ ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తేవడం పరిపాటిగా మారింది. మరో వైపు గ్రీన్‌ అంబాసిడర్స్‌కు కేంద్ర ప్రభుత్వం వేతనాలు విడుదల చేయకపోవడంతో ఆ భారం పంచాయతీలే భరించాలని ప్రభుత్వం తేల్చిచెబుతోంది. మరోవైపు వేసవి రానున్న నేపథ్యంలో తాగునీటి సమస్య పొంచి ఉంది. ఆర్థిక సంఘం నిధులతో ఏదైనా చేద్దామని ఆశించిన సర్పంచ్‌లకు ప్రభుత్వం నుంచి ఆశించిన మేర సహకారం కరువైంది. గత నెలాఖరులో కేంద్ర ప్రభుత్వం ఆర్థికసంఘం నిధుల ద్వారా రూ.31.87 కోట్లకుపైగా నిధులు వచ్చాయి. వాటిని ఏదో ఒక మంచిపని కోసం వినియోగించుకోవాలనుకున్న పాలకవర్గాలకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలు తలనొప్పిగా మారాయి. ఆర్థిక సంఘం నిధులను విద్యుత్‌ బిల్లులు, పారిశుధ్య కార్మికుల జీతాలు చెల్లించాలని ప్రభుత్వం పంచాయతీలపై ఒత్తిడి పెంచింది. ఇప్పటికే అనేక గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, కార్యదర్శుల మధ్య నిధుల విషయంపై దూరం పెరిగింది. ప్రభుత్వ ఆంక్షలతో కార్యదర్శులు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. అనేక గ్రామాల్లో అత్యవసర సమయంలో చేసిన పనులకు రూ.లక్షల్లో బిల్లులు పేరుకుపోయాయి. పంచాయతీలకు మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు వచ్చిన సమయంలో వివిధ పనులతోపాటు సభల ఏర్పాటుకు అప్పులు తెచ్చి పెట్టారు. ఇప్పుడు వచ్చిన నిధులతో ఆ అప్పులు తీరుద్దామంటే ఆంక్షలు అడ్డొచ్చాయి. ఇప్పటికే ట్రెజరీల్లో అనేక బిల్లులపై ఆంక్షలు విధించగా, మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగింపు కావడం, సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటం, పాలకవర్గాలు నిధుల వినియోగంపై కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతుండటంతో వారు కొట్టుమిట్టాడుతున్నారు.

➡️