పోరు వీడి… పోటీలో జోడి

Mar 28,2024 22:39
పోరు వీడి... పోటీలో జోడి

ప్రజాశక్తి-రామచంద్రపురం1989 ఎన్నికల నుంచి 2024 ఎన్నికల వరకు వేర్వేరు పార్టీల్లో ప్రత్యర్థులుగా తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పోటీపడ్డారు. నాలుగు సార్లు ఒకరు, మూడుసార్లు ఒకరు ఎంఎల్‌ఎలుగా గెలుపొందారు. అప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలు తోట త్రిమూర్తులు గ్రూపు, పిల్లి బోసు గ్రూపులుగా విడిపోయారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుండి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, టిడిపి నుంచి గుత్తుల శ్రీసూర్యనారాయణబాబు, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన తోట త్రిమూర్తులు టిడిపి గూటికి చేరుకున్నారు. 1994 ఎన్నికల్లోను ఆయనే గెలుపొందారు. గుత్తుల సూర్యనారాయణబాబు వివిధ పార్టీలు మారుతూ మనుగడ సాగించలేకపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, తోట త్రిమూర్తులు ప్రధాన పోటీదారులుగా మారారు. 1999 ఎన్నికల్లో పిల్లి బోసు, తోట త్రిమూర్తులుపై తిరిగి విజయం సాధించారు. అనంతరం తోట ప్రజారాజ్యంలో చేరారు. పిల్లి బోస్‌ వైసిపి కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో పిల్లి బోసు ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో వైసిపి ఓటమి పాలైన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను మండపేట ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. వైసిపి తరుపున చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, టిడిపి తరఫున తోట త్రిమూర్తులు పోటీపడ్డారు. వేణు 5వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందగా ఓటమిపాలైన తోట త్రిమూర్తులు వైసిపిలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో తోట పార్టీలో చేరికను ఇటు వేణు, అటు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ తోటను వైసిపిలో చేర్చుకున్నారు. ఆ సమయంలో వైసిపి అమలాపురం పార్లమెంటరీ బాధ్యతలను తోటకు అప్పగించారు. తరువాత పరిణామాల్లో బోసు రాజ్యసభకు పంపించడంతో త్రిమూర్తులును మండపేటకు ఇన్‌ఛార్జిగా వేశారు. ఇదే సమయంలో తోటకు ఎంఎల్‌సి పదవి ఇచ్చారు. తరువాత మంత్రి వేణుపై వ్యతిరేకత వచ్చింది. అవినీతి ఆరోపణలు సైతం ప్రచారం కావడంతో ఆయన్ని రామచంద్రపురం నియోజవర్గం నుంచి రాజమహేంద్రరం రూరల్‌కు ఇన్‌ఛార్జిగా నియమించారు. తోట సైతం పార్టీ మారడంతో నియోజకవర్గంలో టిడిపికి బలమైన కేడర్‌ కరువైంది. ఈ నేపథ్యంలో బిసి సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఇక్కడ ఇన్‌ఛార్జి బాధ్యతలను టిడిపి అధిష్టానం అప్పగించింది. నియోజకవర్గంలో అందర్నీ కలుపుకొని వెళ్లడంలో విఫలం కావడంతో రామచంద్రపురం సీటను అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్‌కు చంద్రబాబు కేటాయించారు.కూటమి అభ్యర్థిగా ఉన్న వాసంశెట్టిన్ని ఎదుర్కొనేందుకు, బిసి, కాపుల ఓట్లు చీలకుండా ఉండేందుకు తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కలిశారు. కాపుల ఓట్లు తోట త్రిమూర్తులు ద్వారా పిల్లి బోస్‌ తనయుడు పిల్లి సూర్యప్రకాష్‌కు మళ్లించాలని, అదేవిధంగా మండపేట నియోజకవర్గంలో బలీయంగా ఉన్న బిసి ఓటర్లను తోట త్రిమూర్తులకు సపోర్ట్‌ చేసే విధంగా ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే ఇంత వరకు ప్రత్యర్థులుగా ఉన్న వీరంతా ద్రాక్షారామంలో ఒక వేదిక ఏర్పాటు చేసుకొని తోట త్రిమూర్తులు అనుచరులు, పిల్లి బోస్‌ అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నారు. తమ కలయిక చారిత్రాత్మక అవసరమని ఇక్కడ గ్రూపుల పోరును విడిచిపెట్టి ఐక్యంగా పిల్లి సూర్య ప్రకాష్‌ను గెలిపించాలని తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. మండపేటలో బిసిలంతా తోట త్రిమూర్తులకు విజయాన్ని అందించాలని బోసు కోరారు. నియోజకవర్గంలో వీరి కలయిక ప్రధాన చర్చనీయాంశమైంది. సాక్షాత్తు జిల్లా పరిషత్‌ సమావేశంలో ఒకరిపై ఒకరు చెప్పులు తీసుకున్న ఘటనలను సైతం మరచి ఆత్మీయ సమావేశంలో ఆలింగనాలు చేసుకోవడంతో అందరూ ఔరా..! అనుకున్నారు. వీరి కలయిక ఎన్నికల్లో విజయాలకు ఎలా సహకరిస్తుందో వేచి చూడాలి.

➡️